Ghatkesar: చేతిలోని డబ్బును లాక్కుని పరిగెత్తిన దొంగ.. అర కిలోమీటరు వెంబడించి పట్టుకున్న మహిళ!

Thief Caught by Woman as he theft her money in Telangana
  • ఘట్‌కేసర్‌లో ఘటన
  • దొంగను పట్టుకున్న మహిళ తెగువపై ప్రశంసలు
  • యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు
చేతిలోని డబ్బు సంచి లాక్కుని పరారైన దొంగను ఓ మహిళ అర కిలోమీటరు వెంబడించి పట్టుకుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఘట్‌కేసర్‌లో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎదులాబాద్‌కు చెందిన నర్సమ్మ పొదుపు సంఘం నాయకురాలు. సభ్యుల నుంచి వసూలైన రూ. 50 వేలను జమ చేసేందుకు ఘట్‌కేసర్‌లోని యూనియన్ బ్యాంకుకు చేరుకుంది. 

ఆమె వద్ద డబ్బులున్న విషయం తెలుసుకుని ఆమెను వెంబడిస్తూ వచ్చిన యువకుడు చేతిలో ఉన్న డబ్బు సంచిని లాక్కుని పరుగులు పెట్టాడు. వెంటనే అప్రమత్తమైన నర్సమ్మ అతడి వెనకే పెద్దగా కేకలు వేస్తూ పరుగులు తీస్తూ వెంబడించింది. అలా దాదాపు అర కిలోమీటరు పాటు పరిగెత్తి ఎట్టకేలకు దొంగను పట్టుకుంది. స్థానికులు గుమికూడడంతో వారికి విషయం చెప్పింది. వారందరూ కలిసి యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దొంగను వెంటాడి పట్టుకున్న నర్సమ్మ తెగువను పోలీసులు ప్రశంసించారు.
Ghatkesar
Thief
Hyderabad
Telangana
Crime News

More Telugu News