సికింద్రాబాద్ అగ్నిప్రమాదం: అస్వస్థతకు గురైన అగ్నిమాపక సిబ్బంది

19-01-2023 Thu 17:16 | Telangana
  • రాంగోపాల్ పేట పీఎస్ పరిధిలో అగ్నిప్రమాదం
  • మంటల్లో కాలిబూడిదవుతున్న డెక్కన్ స్పోర్ట్స్ మాల్
  • ఐదుగురిని కాపాడిన సహాయక సిబ్బంది
  • తీవ్ర పొగతో ఉక్కిరిబిక్కిరైన అగ్నిమాపక సిబ్బంది
  • ఆసుపత్రికి తరలింపు
Fire dept personnel get unwell due to huge smoke at Secunderabad fire accident spot
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో డెక్కన్ స్పోర్ట్స్ వేర్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించడం తెలిసిందే. ఆరంతస్తుల డెక్కన్ స్పోర్ట్స్ వేర్ భవనంలో ఇప్పటికీ మంటలు ఎగసిపడుతున్నాయి. మూడు వైపుల నుంచి మొత్తం 15 ఫైరింజన్లను మోహరించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నికీలలను అదుపులోకి తెచ్చేందుకు రసాయనాలు కూడా వినియోగిస్తున్నారు. 

కాగా, దట్టమైన పొగ కారణంగా ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఇప్పటివరకు భవనంలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించారు. భవనంలో ఇక ఎవరూ లేరని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 

మరోపక్క, డెక్కన్ స్పోర్ట్స్ మాల్ కు పక్కనే ఉన్న నాలుగు భవనాలకు కూడా మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. పరిసరాల్లోని భవనాల్లో నివసిస్తున్న వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. అంతేకాదు, ఆ ప్రాంతంలో ముందుజాగ్రత్తగా విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు.