Delhi IIT student: త్వరలో లండన్ లో ఉద్యోగం.. ఇంతలోనే చిదిమేసిన కారు!

  • రోడ్డు ప్రమాదంలో పీహెచ్ డీ విద్యార్థి ఆష్రఫ్ మృతి
  • కారుతో ఢీకొట్టి వెళ్లిపోయిన దుండగులు
  • ఐఐటీ ఢిల్లీకి దగ్గర్లో ఘటన
  • నిందితుల‌పై కఠిన చ‌ర్య‌లు తీసుకోవాలని బాధితుల డిమాండ్
Delhi IIT student died in car accident

ఐఐటీ ఢిల్లీలో చదువుకున్నాడు.. లండన్ లో జరిగిన ఇంటర్వ్యూను విజయవంతంగా పూర్తి చేశాడు.. ఉద్యోగం వస్తుందని నమ్మకంతో ఉన్నాడు. ఆ నమ్మకంతోనే తన మిత్రులకు పార్టీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాడు. కానీ విధి మరోలా తలిచింది. అతడు కన్న కలల్ని కారు చక్రాల కింద నలిపేసింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు ప్రమాదంలో 30 ఏళ్ల పీహెచ్ డీ విద్యార్థి ఆష్ర‌ఫ్ న‌వాజ్ ఖాన్ చనిపోయాడు.

ఆష్ర‌ఫ్ కు ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. తండ్రి ఇటీవ‌ల బ్రెయిన్ హెమ‌రేజ్‌తో చనిపోయారు. దీంతో ఇంటి బాధ్యతను తాను తీసుకోవాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో లండ‌న్‌లో జాబ్ ఇంట‌ర్వ్యూను ఇటీవల పూర్తిచేశాడు. జాబ్ వస్తుందన్న సంతోషంలో ఫ్రెండ్స్‌కు పార్టీ ఏర్పాటు చేశాడు. మంగ‌ళ‌వారం స్థానిక ఎస్‌డీఏ మార్కెట్‌లోని ఓ రెస్టారెంట్ లో తన స్నేహితుడు అంకుర్ శుక్లాతో కలిసి భోజనం చేశాడు. తర్వాత రాత్రి 11.15 గంట‌ల సమయంలో ఐఐటీ ఢిల్లీకి దగ్గర్లో రోడ్డు దాటుతుండగా.. వేగంగా దూసుకొచ్చిన కారు వారిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ఆష్రఫ్ ను సఫ్దార్ జంగ్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు. అంకుర్ శుక్లా ప్రస్తుతం మరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇద్దరినీ ఢీకొట్టి వెళ్లిపోయిన దుండగులు కారును కొద్ది దూరం తర్వాత రోడ్డుపై వదిలేసి పారిపోయారు. ఆష్ర‌ఫ్ మృతిపై అత‌డి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మ‌ద్యం మ‌త్తులో వాహ‌నాలు నడుపుతున్నారని, నిందితుల‌పై కఠిన చ‌ర్య‌లు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News