లోకేశ్ పాదయాత్రతో యువతకు దిశానిర్దేశం: యనమల

19-01-2023 Thu 14:43 | Andhra
  • మోసపోయిన యువతలో ఆత్మస్థైర్యం నింపుతుందన్న యనమల
  • యువగళంతో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా
  • యాత్రలో పాలుపంచుకోవాలంటూ పిలుపునిచ్చిన టీడీపీ నేత
lokesh yuvagalam yatra will bring TDP into power in andhrapradesh
మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ముఖ్యంగా రాష్ట్రంలోని యువతను ముఖ్యమంత్రి జగన్ మోసం చేశారని విమర్శించారు. ఏటా జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాదిగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామంటూ యువతకు జగన్ రెడ్డి హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ల మాటే మరిచిపోయారని మండిపడ్డారు.

టీడీపీ హయాంలో ఇచ్చిన నిరుద్యోగ భృతిని కూడా కక్షపూరితంగా రద్దు చేశారని చెప్పారు. జగన్ రెడ్డి హామీలను నమ్మి మోసపోయిన రాష్ట్ర యువతకు దిశానిర్దేశం చేసేలా యూత్ ఐకాన్ నారా లోకేశ్ చేపట్టే యువగళం పాదయాత్ర కొనసాగుతుందని యనమల వివరించారు. ఈ నెల 27న చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచి ప్రారంభమయ్యే యువగళం యాత్రతో జగన్ రెడ్డి అరాచక పాలనకు పతనం మొదలవుతుందని యనమల జోస్యం చెప్పారు.

400 రోజులు, 4 వేల కిలోమీటర్లు సాగే ఈ పాదయాత్రతో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మహా పాదయాత్రలో పాలు పంచుకోవాలని రాష్ట్ర ప్రజలకు యనమల పిలుపునిచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రజలు సంతోషానికి దూరమయ్యారని యనమల పేర్కొన్నారు. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక రైతులు, జే ట్యాక్స్ వేధింపులతో పారిశ్రామికవేత్తలు సతమతమవుతున్నారని ఆరోపించారు.

ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రశ్నార్థకంగా మారగా.. రాజధాని అమరావతిని చంపేశారని, సీమ అభివృద్ధిని అటకెక్కించారని మండిపడ్డారు. భూకబ్జాలతో ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని, జగన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని యనమల పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో ఇబ్బంది పడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు ధైర్యం చెప్పేందుకు లోకేశ్ చేపడుతున్న యువగళం యాత్ర తోడ్పడుతుందని యనమల చెప్పారు.

ప్రజల్లో భరోసా నింపడంతో పాటు రాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు వేదిక కానుందని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని ఈ యాత్ర ద్వారా భరోసా కల్పిస్తామని వివరించారు. యువగళం యాత్ర ప్రకటన తర్వాత ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూస్తుంటే.. పాదయాత్ర రాష్ట్రంలో ప్రభంజనం సృష్టిస్తుందని అర్థమవుతుందని యనమల రామకృష్ణుడు చెప్పారు.