Anjali: ఓటీటీ రివ్యూ: 'ఝాన్సీ' సీజన్ 2 (డిస్నీ ప్లస్ హాట్ స్టార్)

  • అంజలి ప్రధానమైన పాత్రను పోషించిన 'ఝాన్సీ 2' 
  • కీలకమైన పాత్రల్లో చాందినీ - రాజ్ అర్జున్ 
  • ఆసక్తిని రేకేతించిన స్క్రీన్ ప్లే 
  • ప్రతి ఎపిసోడ్ కి బ్యాంగ్ హైలైట్ 
  • నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిన కథ
Jhansi OTT Review

అంజలి ప్రధానమైన పాత్రను పోషించిన 'ఝాన్సీ' సీజన్ 1 కొంతకాలం క్రితం ప్రేక్షకులను పలకరించింది. ప్రతి ఎపిసోడ్ ను ఉత్కంఠ భరితంగా చిత్రీకరించడం వలన, ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. టేకింగ్ పరంగా .. నిర్మాణ విలువల పరంగా కూడా మంచి మార్కులను కొట్టేసిన ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 నుంచి 4 ఎపిసోడ్స్ ను ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ చేయడం మొదలుపెట్టారు. అంజలి .. చాందినీ చౌదరి .. రాజ్ అర్జున్ ప్రధానమైన పాత్రలను పోషించిన సీజన్ 2 ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

ఈ కథ .. మహిత గతంతో మొదలవుతుంది. మహిత (అంజలి)ని .. ఆమె స్నేహితురాలైన బార్బీ (చాందినీ చౌదరి)ని వేశ్య గృహంలో ఉంచుతారు. కేలబ్ (రాజ్ అర్జున్) కొడుకు గీతన్ ఆ వేశ్య గృహానికి తరచూ వచ్చి వెళుతుంటాడు. అక్కడ మహితను చూసిన అతను ఆమెను ఇష్టపడతాడు. తనతో పాటు బయటికి తీసుకుని వెళ్లి తన సరదా తీర్చుకుంటాడు. అతని వలన మహిత నెల తప్పుతుంది. ఆ విషయం తెలుసుకున్న గీతన్ ఆమెను అడ్డు తప్పించాలనుకుంటాడు. అది భరించలేకపోయిన మహిత అక్కడే అతణ్ణి షూట్ చేస్తుంది. 

తన కొడుకును చంపేసిన మహితను తాను చంపేంతవరకూ నిద్రపట్టదని చెప్పిన కేలబ్, ఆమెను వెతకడానికి తన మనుషులను పంపిస్తాడు. కేలబ్ వలన మోసపోయిన ఇబ్రహీమ్ మనుషులు, మహితకు ఆశ్రయం కల్పిస్తారు. వాళ్ల రక్షణలోనే మహిత ఒక మగ శిశువుకి జన్మనిస్తుంది. ఒక రహస్యమైన ప్రదేశంలో వాళ్లు ఉన్నప్పటికీ కేలబ్ మనుషులు కనిపెట్టి దాడిచేస్తారు. ఆ సమయంలోనే మహిత ఒక లోయలోపడిపోయి గతాన్ని మరిచిపోతుంది.  

అలాంటి పరిస్థితుల్లోనే ఆమె సంకీర్త్ (ఆదర్శ్ బాలకృష్ణ) ఫ్యామిలీకి దగ్గరవుతుంది. అతని కూతురు మేహా ఆలనా పాలన చూస్తూ ఉంటుంది. అమీషా ద్వారా తన గతాన్ని గురించి తెలుసుకున్న మహిత, తనలాంటి ఎంతోమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్న కేలబ్ ను అంతం చేయాలని నిర్ణయించుకుంటుంది. ఇక మహితపై పగతో ఉన్న బార్బీ, ఆమెను చంపడానికి గాను కేలబ్ పంచన చేరుతుంది. ఒకరు కేలబ్ ను చంపడానికి రంగంలోకి దిగితే, మరొకరు ఆయనను రక్షించడం కోసం రంగంలోకి దిగుతారు. ఇద్దరిలో ఎవరు గెలుస్తారనేదే కథ. 

దర్శకుడు తిరు .. మొదటి సీజన్ కి ఎంతమాత్రం తగ్గకుండా సీజన్ 2ను నడిపించాడు. సీజన్ 1 తరువాత గ్యాప్ తీసుకుని సీజన్ 2ను వదిలినా, కథ విషయంలో ఎక్కడా అయోమయం కలగదు. ఇక జరిగిన కథ వేయడం వలన కూడా చాలా ఫాస్టుగా ప్రేక్షకులు ప్రస్తుత కథలోకి వచ్చేస్తారు. ఈ రోజున స్ట్రీమింగ్ చేసిన నాలుగు ఎపిసోడ్స్ లో ప్రతి ఎపిసోడ్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తూ కొనసాగుతుంది .. ఆ తరువాత ఎపిసోడ్ పై ఉత్కంఠను రేకెత్తిస్తుంది.

4వ ఎపిసోడ్ ట్విస్టును మాత్రం ఎవరూ గెస్ చేయలేరు. ఆందరి అంచనాలకు భిన్నంగా ఈ ఎపిసోడ్ నడుస్తుంది. ఇక్కడి నుంచి కథ మరో మలుపు తిరుగుతుందనే క్లారిటీ వచ్చేస్తుంది. కథాకథనాలు పట్టుగా నడుస్తాయి. ప్రతి పాత్రను డిజైన్ చేయడంలో .. వాటిని తెరపై ఆవిష్కరించడంలో ఎక్కడా తడబాటు కనిపించదు. యాక్షన్ .. డ్రామా .. సస్పెన్స్ వీటన్నిటినీ కలుపుని ఈ కథ నడుస్తూ ఉంటుంది. ఏ సీన్ కూడా అనవసరంగా అనిపించదు. 

అంజలి నటన ఈ వెబ్ సిరీస్ కి హైలైట్. యాక్షన్ .. ఎమోషనల్ సీన్స్ లో ఆమె గొప్పగా చేసింది. ఇక చాందినీ చౌదరి నటన చాలా నీట్ గా .. సింపుల్ గా అనిపిస్తూనే ఆకట్టుకుంటుంది. రాజ్ అర్జున్ విలనిజం చూస్తుంటే, పెద్ద హీరోతో తలపడే పెద్ద సినిమాను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ కథ తరచూ అటు గతంలోకి .. ఇటు ప్రస్తుతంలోకి వెళ్లి వస్తుంటుంది. అయినా ఎడిటింగ్ పరంగా ఎక్కడా క్లారిటీ మిస్సవ్వదు.

శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అలాగే 'అర్వి' ఫొటోగ్రఫీ కూడా గొప్పదిగా ఉంది. నిర్మాణ విలువల పరంగా కూడా ఈ వెబ్ సిరీస్ ఆకట్టుకుంటుంది. ఇంతవరకూ అయితే 'ఝాన్సీ' కథాకథనాల పరంగా .. టేకింగ్ పరంగా .. కెమెరా పనితనం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. 4వ ఎపిసోడ్ నుంచి నెక్స్ట్ లెవెల్ కి వెళుతున్న ఈ కథ, అక్కడి నుంచి ఎలాంటి మలుపులు తీసుకుంటుందనేది చూడాలి..

More Telugu News