పోలీసుల ముందు లొంగిపోయిన బండి సంజయ్ కొడుకు భగీరథ్

19-01-2023 Thu 13:51 | Telangana
  • తోటి విద్యార్థిపై దాడి కేసులో పలు సెక్షన్ల కింద కేసు
  • స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన పోలీసులు
  • దుండిగల్ పోలీసుల ముందు సాయి భగీరథ్ సరెండర్
Telangana BJP chief bandi sanjay son surrenders in assault case
తోటి విద్యార్థిని దూషించి, దాడిచేసిన కేసులో బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమారుడు బండి సాయి భగీరథ్‌ లొంగిపోయాడు. దుండిగల్‌ పోలీస్ స్టేషన్ లో స్టేషన్‌ బెయిల్‌ కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో సరెండర్ అయ్యాడు. 

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌ మున్సిపాలిటీలోని బహదూర్‌పల్లిలో మహీంద్ర యూనివర్సిటీలో బండి భగీరథ్‌.. తన తోటి విద్యార్థిని తిడుతూ, దాడికి పాల్పడిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీనిపై ఫిర్యాదు అందడంతో దుండిగల్‌ పోలీసులు భగీరథ్‌పై 341, 323, 504, 506 ఆర్/డబ్ల్యూ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

బుధవారం ఉదయమే భగీరథ్‌ తన న్యాయవాదితో కలిసి దుండిగల్‌ ఠాణాకు వచ్చాడు. స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలని పోలీసులను అభ్యర్థించగా వారు తిరస్కరించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉన్నందున బెయిల్‌ ఇవ్వలేమని తెలపడంతో, తాను ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని  చెప్పి, అతడు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలిసింది. తర్వాత భగీరథ్ లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.