Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘పప్పు’ కాదు.. స్మార్ట్‌మేన్: రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రశంసలు

  • రాహుల్ ‘పప్పు’ ఇమేజ్ దురదృష్టకరమన్న రఘురామ్ రాజన్
  • రాహుల్ స్మార్ట్, యంగ్, క్యూరియస్ మేన్ అని ప్రశంస
  • రాజకీయాల్లో చేరికపై స్పష్టత నిచ్చిన ఆర్‌బీఐ మాజీ గవర్నర్
Rahul Gandhi Not Pappu He is a smart man praises RBI Ex Governor Raghuram Rajan

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘స్మార్ట్‌మేన్’ అంటూ భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రశంసించారు. ఆయన నిజంగా చాలా స్మార్ట్ అని, ‘పప్పు’ ఇమేజ్ దురదృష్టకరమని అన్నారు. గత నెలలో రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్న రఘురామ్ రాజన్ ప్రస్తుతం దావోస్‌లో ఉన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరైన ఆయన ‘ఇండియా టుడే’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌కు ఆ ఇమేజ్ రావడం దురదృష్టకరమన్న రఘురామ్ రాజన్.. తాను దాదాపు దశాబ్ద కాలంపాటు వారితో సన్నిహితంగా ఉన్నానని, రాహుల్ పప్పు (ఫూల్) కాదని అన్నారు. ఆయన స్మార్ట్, యంగ్, క్యూరియస్ మేన్ అని ప్రశంసించారు. 

ప్రాధాన్యాలు ఏమిటన్న విషయంతోపాటు నష్టాలను అంచనా వేయగల సామర్థ్యం కలిగి ఉండడం చాలా ముఖ్యమని రాజన్ అన్నారు. రాహుల్ ఆ పనిని సంపూర్ణంగా చేయగలరని తాను భావిస్తున్నట్టు చెప్పారు. భారత్ జోడో యాత్ర విలువల కోసం కట్టుబడి ఉండడంతోనే ఆ యాత్రలో తాను రాహుల్‌తో కలిసి నడిచినట్టు చెప్పారు. 

అలాగే, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలను విమర్శించడంపై మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా తాను విమర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయాల్లో చేరికపై వస్తున్న వార్తలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. భారత్ జోడో యాత్ర విలువల కోసమే తాను రాహుల్‌తో కలిసి నడిచాను తప్పితే తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు.

More Telugu News