జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు

18-01-2023 Wed 21:27 | Sports
  • ఢిల్లీలో రెజ్లర్ల ధర్నా
  • డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ పై ఆరోపణలు
  • ఏళ్ల తరబడి లైంగికంగా వేధిస్తున్నాడన్న వినేశ్ ఫోగాట్
  • కోచ్ లు కూడా అదే బాటలో నడుస్తున్నారని ఆవేదన
WFI President Brij Bhushan Sharan Singh faces sexual exploitation allegations
భారత స్టార్ రెజ్లర్లు ఇవాళ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అంతేకాదు, రెజ్లింగ్ సమాఖ్యకు చెందిన కోచ్ లు కూడా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారని వారు వెల్లడించారు. లైంగిక వేధింపులపై ధ్వజమెత్తిన రెజ్లర్లు ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ కూడా పాల్గొంది. 

వినేశ్ మీడియాతో మాట్లాడుతూ, అనేక సంవత్సరాలుగా మహిళా రెజ్లర్లపై డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది. కొందరు కోచ్ లు కూడా అదే బాటలో నడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, తనకు ఎప్పుడూ లైంగిక వేధింపులు ఎదురుకాలేదని, లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఓ మహిళా రెజ్లర్ ఇవాళ నిర్వహించిన ధర్నాలో ఉందని వెల్లడించింది. 

లక్నోలో నిర్వహించిన జాతీయ శిక్షణ శిబిరంలో కొందరు మహిళలు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తరఫున మహిళా రెజ్లర్లను కలిశారని వినేశ్ ఆరోపించింది. భారత రెజ్లింగ్ సమాఖ్య అవకతవకలపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లడంతో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడికి సన్నిహితంగా ఉండే కొందరు అధికారుల నుంచి చంపేస్తామంటూ తనకు బెదిరింపులు కూడా వచ్చాయని ఆమె వెల్లడించారు. 

సుమారు 10 నుంచి 20 మంది మహిళా రెజ్లర్లకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని, బాధితులే తనకు స్వయంగా చెప్పారని వివరించారు. ఇప్పుడు వారి పేర్లు వెల్లడించలేనని, ఈ విషయమై ప్రధానమంత్రిని గానీ, హోంమంత్రిని గానీ కలిసినప్పుడు వారి పేర్లు వెల్లడిస్తానని వినేశ్ తెలిపారు.

కాగా, తనపై వచ్చిన తీవ్ర ఆరోపణలను డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఖండించారు. తాను తప్పు చేసినట్టు రుజువైతే ఊరేసుకుంటానని అన్నారు. 

బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా నిర్వహించిన ధర్నాలో వినేశ్ ఫోగాట్ తో పాటు సంగీత ఫోగాట్, భజరంగ్ పునియా, సాక్షి మాలిక్, సుమిత్ మాలిక్, సరితా మోరే సహా 30 మంది ప్రముఖ రెజ్లర్లు పాల్గొన్నారు.