కుటుంబ సభ్యుల కోసమే కేసీఆర్ అంతరాత్మ పనిచేస్తుంది: కిషన్ రెడ్డి

18-01-2023 Wed 19:59 | Telangana
  • బీఆర్ఎస్ ఖమ్మం సభలో కేంద్రంపై కేసీఆర్ ఫైర్
  • సీఎం హోదాలో ఉండి దేశాన్ని ఎందుకు అవమానిస్తారన్న కిషన్ రెడ్డి
  • తొమ్మిదేళ్లుగా ప్రజలను మోసగిస్తున్నారని విమర్శలు
Kishan Reddy counters KCR remarks
ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో జాతీయ నేతల సమక్షంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ సీఎం హోదాలో ఉండి దేశాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా బీజేపీని విమర్శించండి కానీ, దేశాన్ని ఎందుకు కించపరుస్తారని ప్రశ్నించారు. 

దేశాన్ని చైనా, పాకిస్థాన్ లతో పోల్చుతూ విమర్శించడం... సైనికులను అవమానించడం కేసీఆర్ కు అలవాటుగా మారిందని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ గత తొమ్మిదేళ్లుగా తెలంగాణ ప్రజలను మోసగిస్తున్నారని అన్నారు. ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, కేంద్రం ఇస్తున్న నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని వివరించారు. 

కేసీఆర్ అంతరాత్మ కుటుంబ సభ్యుల కోసమే పనిచేస్తుందని, తనయుడు కేటీఆర్ ను సీఎంను చేయాలనే ఆయన అంతరాత్మ కోరుకుంటోందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చెబుతున్న వెలుగు ప్రగతి భవన్ లోనూ, ఫాంహౌస్ లో మాత్రమే ఉందని కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని అన్నారు.