KCR: 2024లో మేం ఢిల్లీకి.... మోదీ ఇంటికి!: ఖమ్మం సభలో కేసీఆర్

  • ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
  • 100 ఎకరాల్లో సభ.. జనసంద్రంలా మారిన వైనం
  • ఉత్సాహంగా ప్రసంగించిన తెలంగాణ సీఎం
  • బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెప్పిన కేసీఆర్
KCR targets Modi govt in his speech at BRS meeting

బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తర్వాత నిర్వహిస్తున్న తొలి సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఈ భారీ బహిరంగ సభకు జనాలు పోటెత్తారు. 100 ఎకరాల్లో జనసంద్రాన్ని చూసిన కేసీఆర్ కూడా ఉత్సాహంతో ప్రసంగించారు. దేశంలో చైతన్యం రగిల్చేందుకే బీఆర్ఎస్ పుట్టిందని వెల్లడించారు. దేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందని విమర్శించారు.  

2024లో తాము ఢిల్లీకి వెళ్లడం... మోదీ ఇంటికి వెళ్లడం ఖాయమని ఉద్ఘాటించారు. దేశంలో ఎన్నో వనరులు ఉన్నాయని, 139 కోట్ల జనాభా ఉన్న దేశంలో మనం పిజ్జాలు, బర్గర్లు తినాలా? కందిపప్పు, పామాయిల్ దిగుమతి చేసుకోవాలా? అని ప్రశ్నించారు. నీటి వనరులు ఉన్నా తాగేందుకు విషపు నీరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నీటి అంశాలపై ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తారు... కానీ అది ఉలుకూ పలుకూ లేని విధంగా తయారైంది అని అన్నారు. దేశంలో ఇంకా నీటి యుద్ధాలు అవసరమా? అని నిలదీశారు. మంచి నీరు ఇవ్వడం కేంద్రానికి చేతకావడంలేదని వ్యాఖ్యానించారు. కేంద్రం రాష్ట్రాల మధ్య గొడవలు పెడుతోందని అన్నారు. నదీజలాలు సముద్రం పాలవుతుంటే చూస్తూ కూర్చుంటున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలు వదిలేసి రాజకీయ విమర్శలతో కాలం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నదీ జలాలు ప్రజల గొంతు నింపాలి, పొలాలను తడపాలి అని కేసీఆర్ ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇలాంటివి సాకారం చేసేందుకే బీఆర్ఎస్ పుట్టిందని కేసీఆర్ ఉద్ఘాటించారు. అవసరమైతే మరో ఉద్యమం తప్పదని తన పోరాట నైజాన్ని చాటారు. 

మోదీ విశాఖ ఉక్కును అమ్మేస్తానని చెబుతున్నాడని, కానీ, విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వబోమని కేసీఆర్ ఖమ్మం సభలో స్పష్టం చేశారు. విశాఖ ఉక్కును జాతీయం చేస్తామని అన్నారు. ఎల్ఐసీని మళ్లీ ప్రభుత్వపరం చేస్తామని పేర్కొన్నారు. విద్యుత్ రంగ కార్మికులు, ఎల్ఐసీ ఉద్యోగులు పిడికిళ్లు బిగించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

కేసీఆర్ ప్రసంగం హైలైట్స్...

  • రెండేళ్లలో వెలుగు జిలుగుల భారత్ ను ఆవిష్కరిస్తాం. 
  • దేశమంతా మిషన్ భగీరథతో మంచి నీరు అందిస్తాం. 
  • ప్రతి సంవత్సరం 25 లక్షల మందికి దళితబంధు లబ్ది చేకూర్చుతాం. 
  • మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తాం. 
  • బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే విద్యుత్ ను ప్రభుత్వ అధీనంలోనే ఉంచుతాం. 
  • తెలంగాణలో ఇస్తున్నట్టు దేశమంతా ఉచిత విద్యుత్ ఇవ్వాలి. అందుకు అవసరమయ్యే ఖర్చు రూ.1.45 లక్షలు.  
  • మేం అధికారంలోకి వస్తే దేశమంతటా రైతాంగానికి ఉచిత విద్యుత్ అందజేస్తాం. 
  • దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రైతు బంధు అమలు చేస్తాం. 
  • తెలంగాణ మోడల్ ను దేశమంతా తీసుకువస్తాం. 
  • సైనిక నియామకాల పథకం అగ్నిపథ్ ను రద్దు చేస్తాం. 

More Telugu News