ఉక్రెయిన్ లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం... హోం మంత్రి సహా 18 మంది మృతి

18-01-2023 Wed 15:02 | International
  • ఉక్రెయిన్ లో అత్యంత విషాద ఘటన
  • కీవ్ నగర శివార్లలో కుప్పకూలిన హెలికాప్టర్
  • హోం మంత్రి, డిప్యూటీ హోంమంత్రి, సహాయ మంత్రి దుర్మరణం
  • మృతుల్లో ముగ్గురు చిన్నారులు
Ukraine Interior minister died in helicopter crash
ఉక్రెయిన్ లో అత్యంత విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో ఉక్రెయిన్ హోం మంత్రి డెనిస్ మొనాస్టిర్ స్కీ సహా 18 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో డిప్యూటీ హోంమంత్రి యెవ్ గెనీ యెనిన్, సహాయ మంత్రి యూరీ లుబ్కోవిచ్ కూడా ఉన్నారు. 

రాజధాని కీవ్ శివార్లలోని ఓ కిండర్ గార్టెన్ పాఠశాల సమీపంలో ఈ హెలికాప్టర్ కూలిపోయింది. చనిపోయినవారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. కాగా, కూలిపోయిన హెలికాప్టర్ ఉక్రెయిన్ ప్రభుత్వ ఎమర్జెన్సీ సేవల విభాగానికి చెందినదని పోలీసులు వెల్లడించారు. హెలికాప్టర్ కూలిపోయిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. 

ఘటన జరిగిన వెంటనే స్పందించిన అధికారులు కిండర్ గార్టెన్ పాఠశాల నుంచి చిన్నారులను, సిబ్బందిని అక్కడి నుంచి తరలించారు. పాఠశాల భవనం వద్ద హెలికాప్టర్ శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. హెలికాప్టర్ కూలిపోయిన సమయంలో వెలుతురు సరిగా లేదని, దట్టమైన పొగమంచు అలముకుని ఉందని తెలుస్తోంది .