వేలాది కార్లను వెనక్కి పిలిపిస్తున్న మారుతి సుజుకి

18-01-2023 Wed 14:34 | Business
  • డిసెంబరు 8 నుంచి జనవరి 12 మధ్య తయారైన కార్ల రీకాల్
  • ఎయిర్ బ్యాగ్ కంట్రోలర్లలో లోపం తలెత్తే అవకాశం
  • 17,362 కార్ల రీకాల్ కు ప్రకటన
  • తనిఖీ, మరమ్మతులు ఉచితం అని మారుతి వెల్లడి
Maruti Suzuki recalls huge number of cars due to airbag controller ditch
కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి పెద్ద సంఖ్యలో కార్లను వెనక్కి పిలిపిస్తోంది. 2022 డిసెంబరు 8వ తేదీ నుంచి ఈ ఏడాది జనవరి 12వ తేదీ మధ్య తయారైన కార్ల ఎయిర్ బ్యాగ్స్ కంట్రోలర్లలో లోపం తలెత్తే అవకాశం ఉన్నట్టు మారుతి సుజుకి చెబుతోంది. ఈ లోపం ఉన్న కార్లలో సీట్ బెల్టులు పనిచేయకపోవచ్చని, ప్రమాదం జరిగితే ఎయిర్ బ్యాగులు తెరుచుకోకపోవచ్చని గుర్తించారు. అందుకే 17,362 కార్లను మారుతి సుజుకి రీకాల్ చేస్తోంది. 

వెనక్కి పిలిపిస్తున్న ఈ కార్లలో గ్రాండ్ విటారా, బ్రెజా, ఆల్టో కే10, ఈకో, బాలెనో, ఎస్ ప్రెసో మోడళ్లు ఉన్నాయి. ఈ మేరకు మారుతి సుజుకి సంస్థ నేడు ప్రకటన చేసింది. 

రీకాల్ చేసిన కార్లలో లోపం ఉంటే సరిదిద్ది తిరిగి కస్టమర్లకు అప్పగిస్తామని వెల్లడించింది. ఇందుకు ఎలాంటి చార్జీ వసూలు చేయబోమని స్పష్టం చేసింది. కారు తనిఖీ, మరమ్మతులు పూర్తిగా ఉచితమని తెలిపింది.