హాలీవుడ్ లో ప్రయోగానికి సిద్ధం: ఎస్ఎస్ రాజమౌళి

18-01-2023 Wed 14:26 | Entertainment
  • ఫీచర్ ఫిల్మ్ చేయాలని అనుకుంటున్నట్టు వెల్లడి
  • ఎక్కడ, ఎలా మొదలు పెట్టాలో తెలియదన్న దర్శకుడు
  • హాలీవుడ్ లో సినిమా తనకు ప్రతిష్ఠాత్మకమన్న రాజమౌళి
Post RRR Golden Globe win SS Rajamouli to direct a Hollywood film Director has THIS to say
బాహుబలితో భారత్ వ్యాప్తంగా, ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. తదుపరి హాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చే ఆలోచనతో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో మరింత ప్రచారం వచ్చింది. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు, అవతార్ సినిమా రూపకర్త జేమ్స్ కామెరాన్ సైతం ఆర్ఆర్ఆర్ సినిమాను చూసి, రాజమౌళిని మెచ్చుకోవడం తెలిసిందే. దీంతో రాజమౌళి తదుపరి సినిమా హాలీవుడ్ లోనే అనే ప్రచారం మొదలైంది.

దీనికి రాజమౌళి కూడా సానుకూలంగానే స్పందించడం గమనార్హం. హాలీవుడ్ ఫీచర్ ఫిల్మ్ కు దర్శకత్వం వహించాలని అనుకుంటున్నట్టు ఆయన చెప్పారు. కాకపోతే ఎక్కడ ఈ ప్రక్రియను మొదలు పెట్టాలో అర్థం కావడం లేదన్నారు. ఈ విషయంలో ఎవరో ఒకరితో తాను కలసి పనిచేయాల్సి ఉంటుందన్నారు. ‘‘భారత్ కు తిరిగి చేరుకున్నాను. నేను డైరెక్టర్ ను. ఒక సినిమాను ఎలా తీయాలో ఎవరూ నాతో చెప్పరు. బహుశా నా మొదటి అడుగు ముందుగా ఎవరో ఒకరి సహకారం తీసుకోవడం కావచ్చు’’ అని ఓ వార్తా సంస్థతో అన్నారు. 

హాలీవుడ్ సినిమా తనకు ప్రతిష్ఠాత్మకమైన స్వప్నంగా రాజమౌళి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దర్శకుడికీ హాలీవుడ్ లో సినిమా చేయాలని ఉంటుందని, దీనికి తాను కూడా అతీతుడిని కాదనీ అన్నారు. ప్రయోగం చేయడానికి తాను సిద్దంగా ఉన్నట్టు చెప్పారు. రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేశ్ బాబుతో తీయనుండడం తెలిసిందే.