superfoods: రాత్రంతా నానబెట్టి.. పొద్దున్నే తినదగిన చక్కని ఫుడ్స్

  • బాదంతోపాటు కిస్ మిస్, వాల్ నట్స్ ను ఇలా తీసుకోవచ్చు
  • పెసలు నానబెట్టి మొలకెత్తించి తింటే మంచిది
  • నానబెట్టి తీసుకుంటే అజీర్ణ సమస్యలు ఉండవు
soaked superfoods to eat on empty stomach for boosting immunity and health

రాత్రంతా నీటిలో బాదం గింజలను నానవేసి పొద్దున్నే తినడం గురించి వినే ఉంటారు. ఇలా చేయడం వల్ల మన వంటికి పోషకాలు మంచిగా అందుతాయి. బాదం గింజలనే కాకుండా ఇలా నీటిలో నానబెట్టి తీసుకోదగిన మరికొన్ని మంచి ఫుడ్స్ కూడా ఉన్నాయి.


బాదం
రోజువారీ ఐదు నుంచి ఏడు వరకు బాదం గింజలను రాత్రి కప్పు నీటిలో వేసి, ఉదయం లేవగానే పైన పొట్టు తీసేసి తినేయాలి. ఇలా చేయడం వల్ల మహిళల్లో పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. మొటిమలు తగ్గుతాయి. చర్మం రంగు నిగారింపు సంతరించుకుంటుంది. 

కిస్ మిస్ లు
6-8 కిస్ మిస్ లను రాత్రంతా నీటిలో వేసి ఉంచి ఉదయం లేవగానే తినేయవచ్చు. వీటికి ఓ రెండు కుంకుమ పువ్వు పోగులు కలిపితే ఇంకా మంచిది. తెల్లవే కాకుండా, నల్లటి కిస్ మిస్ లను కూడా తినొచ్చు. వ్యాధి నిరోధక శక్తి బలపడడంతోపాటు, శరీరానికి మంచి శక్తి లభిస్తుంది.

వాల్ నట్స్
రెండు వాల్ నట్స్ (పూర్తిగా)ను నీటిలో వేసి, పొద్దున్నే తినాలి. దీనివల్ల మెదడు శక్తి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ముఖ్యంగా చిన్నారులకు వీటి అవసరం ఎంతో ఉంటుంది. అలాగే వృద్ధులకు కూడా చాలా మేలు చేస్తుంది.

పెసరగింజలు
రెండు స్పూన్ల పెసర గింజలను నీళ్లలో వేసి నానబెట్టాలి. వీటిని మొలకెత్తించుకుని ఉదయం తినేయాలి. దీనివల్ల చర్మం, శిరోజాలు, కండరాల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. మహిళలు, టీనేజీలో ఉన్న వారికి మరీ మంచిది. 

ఫిగ్స్
అంజీర అని పిలుస్తుంటాం. రెండు అంజీరలను రాత్రంతా నీళ్లలో వేసి ఉంచి ఉదయాన్నే తింటే పేగులకు మంచి జరుగుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. గర్భిణులకు, వృద్ధులకు మలబద్ధకం సమస్య ఎదురవుతుంటుంది. వారు దీన్ని తీసుకోవచ్చు. ఇంకా వేరుశనగలు, పిస్తా పప్పును కూడా నానబెట్టి తినడం మంచిది. 

నానబెట్టడంవల్ల ఉపయోగాలు
నట్స్ తో ఐరన్, ప్రొటీన్, క్యాల్షియం, జింక్ తగినంత లభిస్తాయి. కానీ, వీటిని తిన్నప్పుడు వీటిల్లోని ఈ పోషకాలను మన శరీరం గ్రహించాలంటే అందుకు నానబెట్టడం మంచి మార్గం. దీనివల్ల అజీర్ణానికి కారణమయ్యే ఫైటిక్ యాసిడ్ పోతుంది.

More Telugu News