vitiligo:  బొల్లి వ్యాధికి కారణాలేంటి? చికిత్సలేంటి?

What is vitiligo The skin condition Malayalam actress Mamta is diagnosed with
  • ఇదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్
  • రసాయనాల ప్రభావం, మానసిక కుంగుబాటుతో రావచ్చు
  • ఔషధాలు, ఫొటో థెరపీతో సమస్య పెరగకుండా అడ్డుకోవచ్చు
మలయాళ నటి మమతా మోహన్ దాస్ తాను విటిలిగో వ్యాధి బారిన పడినట్టు ఇటీవలే ప్రకటించారు. దీంతో ఈ వ్యాధి ఏంటా? అన్న సందేహం ఏర్పడింది. దీన్ని మనం బొల్లి వ్యాధి అని పిలుస్తుంటాం. మన చుట్టు పక్కల బొల్లి వ్యాధితో కొందరు కనిపిస్తుంటారు. ఇదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే మనల్ని రక్షించాల్సిన రోగ నిరోధక వ్యవస్థ మనపైనే దాడి చేయడం మొదలు పెడితే వచ్చే ఎన్నో రకాల వ్యాధుల్లో విటిలిగో కూడా ఒకటి.

చర్మంపై కనిపిస్తుంది..
బొల్లి వ్యాధి అనేది చర్మానికి సంబంధించిన సమస్య. ఈ సమస్యలో చర్మం తన వర్ణాన్ని కోల్పోతుంది. చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. మొదట్లో శరీరంలోని కొన్ని ప్రాంతాల్లోనే ఈ మచ్చలు ఏర్పడి ఆ తర్వాతి నుంచి విస్తరించడం మొదలవుతుంది. ముందుగా చేతులు, ముఖం, పాదాలపై కనిపిస్తాయి. కొంత కాలానికి ఈ మచ్చలు పెద్దవిగా మారతాయి. శిరోజాలకు వ్యాపిస్తుంది. నోటిలోపల కూడా ఈ సమస్య కనిపిస్తుంది. చర్మంపై తెల్లటి మచ్చలు ఒకటికంటే ఎక్కువ ప్రాంతాల్లో కనిపిస్తే వెంటనే అప్రమత్తమై వైద్యులను సంప్రదించాలి. లేదంటే ఈ సమస్య శరీరంలోని చాలా ప్రాంతాలకు వ్యాపిస్తుంది. ఫలితంగా నలుగురిలోకి వెళ్లలేని పరిస్థితి ఎదురవుతుంది.

లక్షణాలు, కారణాలు
మన చర్మం రంగును నిర్ణయించేవి మెలనోసైట్స్ కణాలు. ఇవి మెలనిన్ అనే పిగ్మెంట్ ను తయారు చేస్తుంటాయి. మెలనోసైట్స్ కణాలు ఎక్కువగా ఉన్న వారి చర్మం నల్లగా ఉంటుంది. తక్కువగా ఉన్నవారు తెల్లగా ఉంటారు. వ్యాధి నిరోధక శక్తిలో భాగమైన యాంటీబాడీలు ఈ మెలనోసైట్స్ కణాలపై దాడి చేసి నాశనం చేయడం వల్ల బొల్లి వ్యాధి ఏర్పడుతుంది. దీనివల్ల చర్మం సహజ రంగును కోల్పోయి తెల్లగా కనిపిస్తుంది. విటిలిగో సమస్య జన్యుపరంగా, కుటుంబంలో ఎవరికైనా ఉంటే ఇతరులకు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే మానసిక కుంగుబాటు, రసాయన ప్రభావాలకు గురి కావడం, ఎండకు అధికంగా ఎక్స్ పోజ్ కావడం వల్ల కూడా బొల్లి వ్యాధి రావచ్చు. 

చికిత్స
బొల్లి వ్యాధికి అందుబాటులో కొన్ని రకాల ఔషధాలు ఉన్నాయి. సమస్య విస్తరించకుండా ఫొటో థెరపీని వైద్యులు సూచించవచ్చు. తెల్ల మచ్చలను పోగొట్టేందుకు సోరాలెన్ విత్ లైట్ థెరపీ కూడా ఉంది. దీన్నే ఫొటో కీమో థెరపీ అంటారు. సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే శాశ్వత నివారణ సాధ్యం కాకపోవచ్చు. అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య విధానాల ప్రకారం బొల్లి వ్యాధిని ఆరంభంలోనే గుర్తించినట్టయితే అది పెరగకుండా అడ్డుకోవచ్చు.
vitiligo
bolli
actress
Mamta mohandas
treatment
causes

More Telugu News