Taliban: తాలిబన్ల క్రూరత్వం.. దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురి చేతులు బహిరంగంగా నరికివేత!

  • కాందహార్ ఫుట్‌బాల్ స్టేడియంలో శిక్ష అమలు
  • మత పెద్దలు, వందలాదిమంది ప్రజల సమక్షంలో శిక్ష
  • మరో 9 మందిని కొరడాలతో శిక్షించిన వైనం
Taliban publicly cut off hands of 4 of them in stadium

తాలిబన్లు మరోమారు తమ క్రూరత్వాన్ని చాటుకున్నారు. దొంగతనం ఆరోపణలపై నలుగురి చేతులను బహిరంగంగా ఖండించారు. కాందహార్‌లోని అహ్మద్ షాహి ఫుట్‌బాల్ స్టేడియంలో వందలాది మంది చూస్తుండగానే తాలిబన్లు ఈ శిక్షను అమలు చేశారు. అలాగే, వివిధ నేరాల కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న 9 మందిని కొరడా దెబ్బలతో శిక్షించినట్టు గవర్నర్ కార్యాలయ అధికార ప్రతినిధి హజీ జైద్ తెలిపారు. నిందితులను 35 నుంచి 39 సార్లు కొరడాలతో కొట్టి శిక్షించారు. 

ఈ ఘటన జరిగినప్పుడు మత పెద్దలు, స్థానికులు పెద్ద ఎత్తున స్టేడియంలో గుమికూడారు. శిక్ష కోసం ఎదురుచూస్తూ 9 మంది స్టేడియంలో కూర్చున్న ఫొటోలు సోషల్ మీడియాకెక్కాయి. మానవ హక్కుల న్యాయవాది, ఆఫ్ఘనిస్థాన్ రీసెటిల్‌మెంట్, రిఫ్యూజీ మంత్రిత్వశాఖ మాజీ సలహాదారు షబ్నమ్ నాసిమి ఈ ఫొటోలను షేర్ చేశారు. చరిత్ర పునరావృతం అయిందని, 1990ల నాటి బహిరంగ శిక్షల అమలు మళ్లీ మొదలైందని ఆఫ్ఘన్ జర్నలిస్ట్ తాజుదెన్ సోరౌష్ ఆవేదన వ్యక్తం చేస్తూ స్టేడియం వెలుపలి దృశ్యాలకు సంబంధించిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

గతేడాది డిసెంబరులో తాలిబన్లు తొలిసారి ఓ వ్యక్తికి హత్యకేసులో బహిరంగంగా మరణశిక్ష అమలు చేశారు. ఫరా ప్రావిన్సులో వందలాదిమంది ఎదుట, తాలిబన్ ఉన్నతాధికారుల సమక్షంలో ఈ శిక్షను అమలు చేశారు. నిందితుడిని బాధితురాలి తండ్రితో తుపాకితో కాల్చి చంపించారు.

More Telugu News