Hyderabad: బిడ్డను వదిలించుకుందామన్న భర్త వేధింపులు భరించలేక.. 22 అంతస్తుల పైనుంచి దూకేసి తనువు చాలించిన భార్య!

  • మానసిక వైకల్యంతో పుట్టాడని బిడ్డను ఆదరించని భర్త
  • పసికందును వదిలించుకోవాలని భార్యకు వేధింపులు
  • మూడేళ్ల పాటు పుట్టింట్లోనే ఉంటూ బిడ్డను కాపాడుకున్న తల్లి
  • నమ్మించి హైదరాబాద్ తీసుకొచ్చిన భర్త వేధింపులు తీవ్రం చేయడంతో ఆత్మహత్య చేసుకున్న భార్య
Hyderabad Woman Jumps from 22 Floor Building While Husband Harassment

మానసిక ఎదుగుదల సరిగాలేని బిడ్డను వదిలించుకోవాలన్న భర్త ప్రయత్నాన్ని అడ్డుకున్న ఓ భార్య చివరకు బలవన్మరణానికి పాల్పడింది. బిడ్డను చంపేయాలని భర్త వేధిస్తుండడంతో తట్టుకోలేక 22 అంతస్తుల పై నుంచి దూకేసింది. బిడ్డను అపార్ట్ మెంట్ లోనే వదిలి ప్రాణాలు తీసుకుంది. హైదరాబాద్ లో మంగళవారం జరిగిందీ ఈ దారుణం.

కాకినాడకు చెందిన నేమాని శ్రీధర్ కు, సర్పవరంకు చెందిన స్వాతితో 2013లో వివాహం జరిగింది. మూడేళ్ల తర్వాత ఈ దంపతులకు కొడుకు పుట్టాడు. అయితే, మానసిక వైకల్యంతో పుట్టడంతో కొడుకును శ్రీధర్ చేరదీయలేదు. బిడ్డ తనకు వద్దంటూ భార్యతో గొడవపడుతూ వస్తున్నాడు. ఈ గొడవ నేపథ్యంలో స్వాతి చాలా కాలం పుట్టింట్లోనే ఉండిపోయింది. అనారోగ్యంతో బాధపడుతున్న పసివాడిని అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. మూడేళ్లు గడిచినా శ్రీధర్ మనసు మార్చుకోలేదు. భార్యను వేధించడం మానుకోలేదు.

పసివాడిని వదిలించుకోవాలని అన్ని రకాలుగా ప్రయత్నించాడు. చెత్తకుప్పలో పడేయాలని, అనాథాశ్రమంలో వదిలేద్దామని స్వాతిని ఒప్పించేందుకు ప్రయత్నించాడు. అంతేగానీ తన ఇంట్లోకి ఆ బిడ్డను రానీయనంటూ పట్టుబట్టాడు. అయినా స్వాతి వినిపించుకోలేదు, కొడుకును వదులుకోవడానికి ఒప్పుకోలేదు. దీంతో మాటమార్చిన శ్రీధర్.. భార్యాబిడ్డలను బాగా చూసుకుంటానని నమ్మించి హైదరాబాద్ తీసుకొచ్చాడు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు.

శ్రీధర్ వేధింపులకు ఆయన తల్లిదండ్రులు, సోదరి, ఆమె భర్త కూడా వంతపాడారు. నిత్యం వేధింపులకు పాల్పడుతుండడంతో విసిగిపోయిన స్వాతి.. మంగళవారం అపార్ట్ మెంట్ పైకెక్కి, అక్కడి నుంచి కిందికి దూకేసింది. 22 అంతస్తుల పైనుంచి దూకడంతో స్వాతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్వాతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీధర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

More Telugu News