Bandi Sanjay: తక్షణమే పీఆర్సీ ఏర్పాటు చేయాలంటూ.. సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

  • పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలన్న సంజయ్ 
  • పెంచిన జీతాలను జులై 1 నుంచి ఇవ్వాలంటూ డిమాండ్ 
  • ఉద్యోగులను అడుగడుగునా మోసం చేస్తున్నారంటూ విమర్శ  
  • లేకపోతే బీజేపీ ఉద్యమిస్తుందని హెచ్చరిక
Bandi Sanjya wrote CM KCR for new PRC

తక్షణమే వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటు చేసి, పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు జులై 1 నుంచి జీతాలు చెల్లించాలని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నాడు ఉద్యోగులు, ఉపాధ్యాయులు 42 రోజుల పాటు సకల జనుల సమ్మె చేస్తే ఆనాటి ప్రభుత్వం దిగొచ్చిందని బండి సంజయ్ తెలిపారు. పార్లమెంటులో బీజేపీ మద్దతుతో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది స్వరాష్ట్రం ఏర్పాటైందని వివరించారు. కానీ, స్వరాష్ట్రంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల హక్కులను కాపాడాల్సిన మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వారిని అడుగడుగునా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 

"ప్రతి నెల 1వ తేదీన జీతాలు తీసుకోవడం ఉద్యోగుల హక్కు. కానీ సక్రమంగా జీతాలు చెల్లించకుండా వారి హక్కులను కాలరాస్తున్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన 4 డీఏలను కూడా ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారు. పీఆర్సీ అమలు విషయంలోనూ మోసం చేస్తున్నారు. సీఆర్ బిశ్వాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన తొలి పీఆర్సీ నివేదికను 2018 జులై 1 నుంచి అమలు చేయాల్సి ఉన్నా, 21 నెలలు అమలు చేయకుండా ఉద్యోగ, ఉపాధ్యాయులను ఇబ్బందిపెట్టారు. 

ఈ ఏడాది జూన్ 30తో మొదటి పీఆర్సీ గడువు ముగుస్తుంది. ఈ ఏడాది జులై 1 నుంచి కొత్త పీఆర్సీ అమల్లోకి రావాలి. కానీ ఇంతవరకు పీఆర్సీ కమిషన్ నియమించకపోవడం అన్యాయం. పీఆర్సీ నివేదిక లేకుండా పీఆర్సీ ఎట్లా అమలు చేస్తారు? మీ వైఖరి చూస్తుంటే ఏదో రకంగా కాలయాపన చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ ఎగ్గొట్టాలనే ధోరణి కనిపిస్తోంది. 

ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని తక్షణమే కొత్త పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేయాలని బీజేపీ తెలంగాణ విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మూడు నెలల గడువు విధించి నివేదిక తెప్పించుకుని, ఈ ఏడాది జులై నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాలని కోరుతున్నాం. లేనిపక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ ఉద్యమిస్తుంది" అని బండి సంజయ్ తన లేఖలో స్పష్టం చేశారు.

More Telugu News