fasting: ఉపవాసంతో బోలెడు ప్రయోజనాలు.. తాజా అధ్యయనంలో వెల్లడి!

  • ఉపవాసంతో కాలేయానికి విశ్రాంతి
  • దీంతో వ్యర్థాల తొలగింపు మరింత ముమ్మరం
  • గుండె, మెదడుకూ మంచి చేస్తుంది
  • వ్యాధి నిరోధక శక్తి తేజోవంతం
How fasting once a week or a month can be beneficial for health

హిందువులు ముఖ్యమైన పండుగల్లో ఉపవాస నియమాన్ని పాటిస్తుంటారు. కొందరు అయితే దేవుడి పేరుతో ప్రతి వారంలోనూ ఉపవాసం చేస్తుంటారు. అయితే, కడుపు మాడ్చుకోవద్దంటూ ఉపవాసం చేసే వారికి ఇంట్లోని మిగిలినవారు సలహా ఇస్తుంటారు. కానీ, నిజానికి ఉపవాసం ఎంతోమంచి చేస్తుందని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. 

గుండెకు మంచిది
ఉపవాసం వల్ల మన శరీరంలోని మొత్తం గ్లూకోజ్, ఫ్యాట్, కీటోన్లను శరీరం వాడుకుంటుంది. ఇలా శరీరంలో అదనంగా ఉన్న నిల్వలు కరుగుతాయి. దీనివల్ల మన శరీంలోని ఇన్ ఫ్లమేషన్ తగ్గుతుంది. దీనివల్ల గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుంది. ట్రై గ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, జీవనశైలి వ్యాధుల ముప్పు తగ్గుతుంది. 

కాలేయానికి విశ్రాంతి
కాలేయానికి కాస్తంత విశ్రాంతి లభిస్తుంది. మన శరీరంలోని మలినాలను శుద్ధి చేసే అతిపెద్ద అవయవం ఇది. తిన్నది జీర్ణం చేసి, బైల్ ను ఉత్పత్తి చేసే ముఖ్యమైన అవయవం కూడా ఇది. మనం ఆహారం తీసుకోకుండా ఉపవాసం పేరుతో బ్రేక్ ఇవ్వడం వల్ల కాలేయానికి సమయం చిక్కుతుంది. జీర్ణం చేసే పని ఉండదు కనుక.. అప్పుడు శరీరంలోని మలినాలు, వ్యర్థాలను తొలగించడంపై మరింత ఫోకస్ పెడుతుంది. కాలేయం అన్నది శరీరంలో మొదటగా వడపోసే ప్రాథమిక అవయవం. టాక్సిన్లను వ్యర్థాలుగా మార్చి బయటకు పంపుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. తీసుకున్న ఔషధాలను ఫిల్టర్ చేస్తుంది.

మెదడు పనితీరు
ఉపవాసం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. న్యూరో డీజనరేటివ్ వ్యాధుల ముప్పు తగ్గుతుంది. ఏదైనా ఆహారం తిన్న వెంటనే అది జీర్ణమయ్యేందుకు వీలుగా అధిక రక్తం కాలేయానికి సరఫరా అవుతుంది. జీర్ణక్రియకు విరామం లభించినప్పుడు రక్త ప్రసరణ మెదడుకు ఎక్కువగా జరుగుతుంది. దీంతో మెదడు మరింత చురుగ్గా తయారవుతుంది.

వ్యాధి నిరోధక శక్తి
ఉపవాసం వల్ల మన శరీరం కొత్త రోగ నిరోధక శక్తిని విడుదల చేయడానికి అవకాశం లభిస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా ఇటీవలి పరిశోధనలోనూ ఇది తేలింది. 72 గంటల పాటు ఉపవాసం ఉంటే స్టెమ్ సెల్ ఆధారిత రీజనరేటివ్ ప్రక్రియ జరుగుతుంది. ఉపవాసం వల్ల మన శరీరంలోని తెల్ల రక్త కణాలు పెద్ద సంఖ్యలో విచ్ఛిన్నం అవుతాయి. దీంతో కొత్త రోగ నిరోధక శక్తి తయారవుతుంది.

More Telugu News