Telangana: తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం ఎప్పుడంటే..

Telangana new Secretariat complex likely to open February 17th
  • వచ్చే నెల 17న ప్రారంభోత్సవమన్న మంత్రి వేముల
  • సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభిస్తామన్న మంత్రి
  • అమరవీరుల స్మారకం, అంబేద్కర్ విగ్రహం పనులు వేగవంతం
  • ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహం ప్రారంభించనున్న ప్రభుత్వం
తెలంగాణంలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయాన్ని వచ్చే నెల 17 న ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సచివాలయ భవన సముదాయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయితే, సచివాలయ నిర్మాణం ఇంకా పూర్తికాలేదని సమాచారం. ఫ్లోరింగ్, ఫాల్ సీలింగ్, ప్రధాన ప్రవేశద్వారం, పోర్టికో వంటి పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 17 లోగా నిర్మాణ పనులు పూర్తయితే మొత్తం భవనాన్ని, లేదంటే ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే ఆరో అంతస్థును, సాధారణ పరిపాలనాశాఖ కోసం మరో అంతస్థును సిద్ధం చేసి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.

కొత్త సచివాలయాన్ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్టుతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే! భవనంలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా సహజంగా డిజైన్ చేశారు. ఆవరణలో ఓ ఆలయం, మసీదును కూడా నిర్మిస్తున్నారు. ఈ భవన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.617 కోట్లు వెచ్చిస్తోంది. ఈ భవన సముదాయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. కాగా, సచివాలయ ప్రారంభోత్సవంపై నిర్ణయం తీసుకోవడంతో నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్ ను ప్రభుత్వం ఆదేశించింది. నిర్మాణ పనుల్లో వేగం పెంచడానికి మూడు షిప్టుల్లో పనులు చేస్తున్నట్లు సమాచారం.

సచివాలయం ఎదురుగా చేపట్టిన తెలంగాణ అమరవీరుల స్మారకం, తెలంగాణ విగ్రహం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. స్మారక నిర్మాణంలో ఫినిషింగ్ పనులు సాగుతుండగా.. అంబేద్కర్ విగ్రహం పనులు వేగంగా జరుగుతున్నాయి. మొత్తం 125 అడుగుల ఎత్తుతో నిర్మించనున్న అంబేద్కర్ విగ్రహం ఇప్పటి వరకు 50 అడుగుల మేర పూర్తయింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న ఈ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.
Telangana
secretariat
inauguration
feb 17th
kcr birthday
secretariat opening

More Telugu News