Rajashree Swain: అడవిలో శవమై కనిపించిన మహిళా క్రికెటర్

  • చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో దర్శనమిచ్చిన రాజశ్రీ స్వైన్
  • ఈ నెల 11 నుంచి కనిపించకుండా పోయిన క్రికెటర్
  • శిక్షణ శిబిరం కోసం కటక్ వచ్చిన రాజశ్రీ
  • జట్టుకు ఎంపిక కాని వైనం
Odisha woman cricketer found hanging in forest

ఒడిశాకు చెందిన మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వైన్ అడవిలో విగతజీవురాలిగా కనిపించింది. కటక్ కు సమీపంలోని దట్టమైన అడవిలో ఆమె మృతదేహం ఓ చెట్టుకు వేళ్లాడుతూ, ఉరివేసుకున్న స్థితిలో గుర్తించారు. ఘటన స్థలానికి సమీపంలో రాజశ్రీ స్కూటర్ పడి ఉంది. రాజశ్రీ స్వైన్ వయసు 26 సంవత్సరాలు. ఆమె ఈ నెల 11వ తేదీ నుంచి కనిపించడంలేదు. 

అయితే అడవిలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన అనంతరం, పోలీసులు అసహజ మరణం కింద కేసు నమోదు చేశారు. రాజశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే ఆమె మృతికి కారణం తెలుసుకోవచ్చని డీసీపీ పినాక్ మిశ్రా వెల్లడించారు. 

రాజశ్రీ స్వైన్ ఒడిశాలోని పూరీ జిల్లాకు చెందిన క్రికెటర్. పుదుచ్చేరిలో జరిగే క్రికెట్ టోర్నీ కోసం ఒడిశా క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు ఆమె కటక్ వచ్చింది. అయితే, తుది 16 మందితో కూడిన జట్టులో ఆమె స్థానం సంపాదించలేకపోయింది. జట్టును ప్రకటించాక తన పేరు లేదని తెలుసుకుని రాజశ్రీ భోరున విలపించిందని ఆమె రూమ్మేట్ వెల్లడించింది. ఆ తర్వాత నుంచి ఆమె హోటల్ గదికి రాలేదని వివరించింది. 

రాజశ్రీ స్వైన్ కనిపించకుండా పోవడంపై కోచ్ పుష్పాంజలి బెనర్జీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, రాజశ్రీని హత్య చేశారంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమె శరీరంపై గాయాలున్నాయని, ఆమె కళ్లు దెబ్బతిన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో, అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతామని పోలీసులు స్పష్టం చేశారు.

More Telugu News