KTR: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ లేఖ

KTR wrotes union minister Nirmala Sitharaman for budget allocation
  • ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
  • తెలంగాణకు నిధులు కేటాయించాలన్న కేటీఆర్
  • తెలంగాణ ప్రగతికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి
  • తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ ప్రాధాన్యత ఉందని వెల్లడి
తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పారిశ్రామిక రంగంలో తెలంగాణ చేపట్టిన కార్యక్రమాలకు త్వరలో ప్రకటించబోయే బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలకంగా మారిందని తెలిపారు. న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులు రాష్ట్రానికి కేటాయించాలని కేటీఆర్ తన లేఖలో స్పష్టం చేశారు. 

తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ ప్రాధాన్యత ఉందని, గత ఎనిమిదేళ్లలో దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రం కీలకంగా మారిందని వివరించారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహకారం అందిస్తే దేశ పురోగతికి సహకారం అందించినట్టేనని వివరించారు. 

రాష్ట్రంలోని పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని, హైదరాబాద్ ఫార్మాసిటీకి బడ్జెట్ లో నిధులు కేటాయించాలని, చేనేత రంగానికి జీఎస్టీ మినహాయించాలని కేంద్రమంత్రిని కోరారు. ఖమ్మంలో సెయిల్ ద్వారా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, ఐటీఐఆర్ లేదా సమాన ప్రాజెక్టు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

బ్రౌన్ ఫీల్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు మంజూరు, వాటి అప్ గ్రేడేషన్, హైదరాబాద్-నాగపూర్, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-విజయవాడ ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధి, హైదరాబాద్ లో నేషనల్ డిజైన్ సెంటర్, ఆదిలాబాద్ సీసీఐ యూనిట్ పునరుద్ధరణ, జహీరాబాద్ నిమ్జ్ లో మౌలిక సదుపాయాల ఏర్పాటు అంశాలపైనా కేటీఆర్... నిర్మలా సీతారామన్ కు రాసిన లేఖలో విజ్ఞప్తులు చేశారు. 

కాగా, కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే.
KTR
Nirmala Sitharaman
Letter
Budget
Telangana

More Telugu News