వసూళ్లలో అదరగొడుతున్న వాల్తేరు వీరయ్య

  • తొలి రోజు 29 కోట్లు రాబట్టిన చిరు సినిమా
  • వీరసింహారెడ్డి కలెక్షన్ పై వీరయ్య ప్రభావం
  • శుక్రవారం రూ.8.6 కోట్లకు తగ్గిన బాలయ్య మూవీ వసూళ్లు
Waltair Veerayya box office collection Day 1

సంక్రాంతి కానుకగా శుక్రవారం విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘వాల్తేరు వీరయ్య’ వసూళ్లలో అదరగొడుతోంది. తొలిరోజు ఏకంగా రూ.29 కోట్లకు పైగా రాబట్టింది. అన్ని భాషల్లో కలిపి ఈ మొత్తం వసూలైనట్లు సినిమా వర్గాలు వెల్లడించాయి. బాస్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ లలో అన్నయ్య అదరగొట్టారని చెబుతున్నారు. 

ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించడంతో ఆయన ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అన్నయ్య సినిమాలో మెగాస్టార్ తో కలిసి నటించిన రవితేజ మళ్లీ ఇన్నాళ్లకు చిరంజీవితో స్క్రీన్ పంచుకున్నారని అంటున్నారు. మళ్లీ వారిద్దరినీ సిల్వర్ స్క్రీన్‌పై కలిసి చూడటం కన్నుల పండుగగా ఉందంటున్నారు.

గతేడాది విడుదలైన చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్ తొలిరోజు వసూళ్లు రూ.12.97 మాత్రమే.. తాజా చిత్రం మాత్రం అన్ని భాషల్లో కలిపి రూ.29 కోట్లు రాబట్టడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాల్తేర్ వీరయ్య సినిమాకు కెఎస్ రవీంద్ర దర్శకత్వం వహించగా.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిరంజీవికి జోడీగా ఈ సినిమాలో శృతిహాసన్ నటించింది. రవితేజకు జోడీగా కేథరిన్ థ్రెసా నటించింది. 

మెగస్టార్ సినిమా రిలీజ్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు హంగామా చేశారు. వాల్తేరు వీరయ్య విడుదల కావడంతో బాలకృష్ణ సినిమా వీరసింహారెడ్డి కలెక్షన్ పై ప్రభావం పడింది. తొలిరోజు గురువారం రూ.33.6 కోట్లు రాబట్టిన వీరసింహారెడ్డి మూవీ.. శుక్రవారం రూ.8.6 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

More Telugu News