Anantapur District: రూ. 30 ఇవ్వనందుకు సిలిండర్ తీసుకెళ్లిపోయిన డెలివరీ బాయ్.. రూ. లక్ష చెల్లించాలన్న వినియోగదారుల ఫోరం

Anantapur onsumer forum Orders Gas Agency to pay Rs One Lakh To Customer
  • అనంతపురంలో ఘటన
  • ఫిర్యాదు చేస్తే లైట్‌గా తీసుకున్న గ్యాస్ ఏజెన్సీ
  • ఆ తర్వాతి నెలలో వినియోగదారుడిని మరో ఏజెన్సీకి మార్చేసిన వైనం
  • డెలివరీ బాయ్‌ను తొలగించాం కాబట్టి పరిహారం చెల్లించక్కర్లేదని ఏజెన్సీ వాదన
  • కుదరదన్న ఫోరం
రూ. 30 ఇవ్వనందుకు గ్యాస్ డెలివరీ బాయ్ సిలిండర్‌ను వెనక్కి తీసుకెళ్లిన ఘటనలో వినియోగదారుల ఫోరం కీలక తీర్పు చెప్పింది. వినియోగదారుడికి లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అనంతపురంలో జరిగిందీ ఘటన. బాధిత వినియోగదారుడికి స్థానిక గుత్తిరోడ్డులోని హనుమాన్ ఏజెన్సీలో హెచ్‌పీ గ్యాస్ కనెక్షన్ ఉంది. 7 అక్టోబరు 2019లో రీఫిల్ సిలిండర్ బుక్ చేశాడు. సిలిండర్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్ అదనంగా రూ. 30 ఇవ్వాలని కోరాడు. అందుకు వినియోగదారుడు నిరాకరించడంతో తెచ్చిన సిలిండర్‌ను వెనక్కి తీసుకెళ్లిపోయాడు.

దీంతో వినియోగదారుడు పౌరసరఫరాల అధికారికి ఫిర్యాదు చేయడంతో డెలివరీ బాయ్ తిరిగి సిలిండర్‌ను తీసుకొచ్చి ఇంటిముందు పెట్టి వెళ్లిపోయాడు. ఈ మొత్తం ఘటనను ఆయన ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్లాడు. వారు దీనిని లైట్‌గా తీసుకున్నారు. సరఫరా ఖర్చులు ఉంటాయని, వాటిని ఇవ్వాల్సిందేనంటూ డెలివరీ బాయ్‌ను సమర్థించారు. అంతేకాక, వినియోగదారుడిని ఆ తర్వాతి నెలలో మరో ఏజెన్సీకి బదిలీ చేశారు. 

దీనిని తీవ్రంగా పరిగణించిన వినియోగదారుడు ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత జిల్లా వినియోగదారుల ఫోరాన్ని కూడా ఆశ్రయించారు. సిలిండర్‌ను సరైన సమయంలో డెలివరీ చేయకపోవడం వల్ల తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఫోరం దృష్టికి తీసుకెళ్లాడు. స్పందించిన ఫోరం గ్యాస్ ఏజెన్సీకి, ఏపీ పౌర సరఫరాల సంస్థకు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టింది. అయితే, డెలివరీ బాయ్‌ను తొలగించామని, కాబట్టి పరిహారం చెల్లించాల్సిన పనిలేదని ఏజెన్సీ వాదించింది. వాదనలు విన్న ఫోరం వినియోగదారుడికి జరిగిన నష్టానికి గాను పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది.
Anantapur District
Gas Cylinder
Consumer Forum

More Telugu News