Annamalai: తమిళనాడు బీజేపీ చీఫ్ కి 33 మంది కమెండోలతో జెడ్ కేటగిరీ భద్రత

  • ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా భద్రత పెంపు
  • అన్నామలైకు మావోలు, తీవ్రవాదుల నుంచి బెదిరింపులు
  • డీఎంకే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న అన్నామలై
Z Category security to Tamil Nadu BJP chief

తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైకి కేంద్ర ప్రభుత్వం భద్రతను భారీగా పెంచింది. ఆయన రక్షణ కోసం 33 మంది సీఆర్పీఎఫ్ కమెండోలను నియమించనున్నారు. ఆయన భద్రతకు సంబంధించి ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయనకు వై కేటగిరీ భద్రత ఉంది. 

మావోయిస్టులు, తీవ్రవాదుల నుంచి అన్నామలైకు బెదిరింపులు వస్తున్నాయి. తమిళనాడులో చాలా ప్రాంతాల్లో ఇస్లామిక్ టెర్రరిజం స్లీపర్ సెల్స్ పెరుగుతున్నాయి. నిషేధిత పీఎఫ్ఐ కార్యకలాపాలు సైతం పెరుగుతున్నాయి. దీనికి తోడు అధికార పార్టీ డీఎంకే తప్పిదాలను ప్రజల్లోకి ఆయన తీసుకెళ్తున్నారు. సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ను టార్గెట్ చేస్తూ ఆయన ఇటీవల తీవ్ర విమర్శలు గుప్పించారు. మరోవైపు ఉగ్రవాద ఘటనలపై డీఎంకే ప్రభుత్వం మెతక వైఖరిని అవలంబిస్తోందని విమర్శించారు. పరిణామాలన్నింటి నేపథ్యంలో అన్నామలైకు కేంద్రం భారీ భద్రతను ఏర్పాటు చేస్తోంది. 

తమిళనాడుకు చెందిన అన్నామలై 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కావడం గమనార్హం. కర్ణాటక కేడర్ అధికారిగా ఆయన ఆ రాష్ట్రంలో పలు చోట్ల పని చేశారు. 2019లో ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరిన ఆయనకు ఆ పార్టీ ఏకంగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టింది.

More Telugu News