Sharad Yadav: కేంద్రమాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత

  • దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శరద్ యాదవ్
  • నిన్న ఇంట్లో కుప్పకూలి అపస్మారక స్థితిలోకి
  • రాత్రి 10.19 గంటలకు చనిపోయినట్టు ప్రకటన
  • ప్రధాని సహా పలువురి సంతాపం
Former Union Minister Sharad Yadav Passed away

కేంద్రమాజీ మంత్రి, ప్రముఖ సోషలిస్ట్ నేత శరద్ యాదవ్ కన్నుమూశారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న ఢిల్లీలోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు తరలించారు. అపస్మారక, స్పందన లేని స్థితిలో ఆయనను ఆసుపత్రికి తీసుకొచ్చినట్టు వైద్యులు తెలిపారు. పల్స్ కొట్టుకోకపోవడం, రికార్డు చేయదగిన బ్లడ్ ప్లజర్ లేకపోవడంతో వెంటనే ఆయనకు సీపీఆర్ చేశారు. ఆయనను బతికించేందుకు పలు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో రాత్రి 10.19 గంటలకు మరణించినట్టు ప్రకటించారు.

విద్యార్థి నేతగా..
విద్యార్థి నేతగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన శరద్ యాదవ్.. కాంగ్రెస్‌ వ్యతిరేకిగా పేరు తెచ్చుకున్నారు. జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన తన జీవితంలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషించారు. అయితే, ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్, రాజకీయ ప్రత్యర్థి లాలు ప్రసాద్ యాదవ్‌తో చేతులు కలిపారు. 2015 బీహార్ ఎన్నికల తర్వాత మహాకూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు.
 
కేంద్రమంత్రిగా..
అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో, అంతకుముందు వీపీ సింగ్ ప్రభుత్వంలో శరద్ యాదవ్ కేంద్రమంత్రిగా సేవలు అందించారు. రాజ్యసభకు మూడుసార్లు ప్రాతినిధ్యం వహించిన ఆయన లోక్‌సభకు ఏడుసార్లు ఎన్నికయ్యారు. బీహార్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ) వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా. మహాకూటమి నుంచి నితీశ్ కుమార్ బయటకు వచ్చి బీజేపీతో చేతులు కలపడంతో శరద్ యాదవ్ పార్టీని వీడాడు. 

సొంత పార్టీ
జేడీయూ నుంచి బయటకు వచ్చిన తర్వాత 2018లో లోక్ తాంత్రిక్ జనతా దళ్ పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేశారు. రెండేళ్ల తర్వాత లాలు ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని రాష్ట్రీయ జనతా దళ్ (జేడీయూ)లో విలీనం చేశారు.  

ప్రముఖుల సంతాపం
శరద్ యాదవ్ మృతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. సుదీర్ఘ ప్రజా జీవితంలో ఎంపీగా, మంత్రిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. డాక్టర్ లోహియా భావజాలం నుంచి ప్రేరణ పొందారని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు.  

శరద్ యాదవ్ తన రాజకీయ సంరక్షకుడని బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ పేర్కొన్నారు. తాను ఉప ముఖ్యమంత్రిని కావడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారని, ఈ విషయాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. శరద్ యాదవ్ మృతి వార్త తనను బాధించిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. సింగపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లాలు ప్రసాద్ యాదవ్ ఓ వీడియో మెసేజ్ విడుదల చేస్తూ.. తనకు, శరద్ యాదవ్‌కు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అవెప్పుడూ తమ మధ్య శత్రుత్వానికి కారణం కాలేదని అన్నారు.

More Telugu News