Ashok Babu: హైకోర్టు జీవో నెం.1ని సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యవాదులకు సంక్రాంతి పండుగ లాంటిది: అశోక్ బాబు

  • ఇటీవల జీవో నెం.1 తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం
  • తాత్కాలికంగా నిలుపుదల చేసిన హైకోర్టు
  • హైకోర్టు తీర్పు హర్షణీయమన్న అశోక్ బాబు
Ashok Babu opines on High Court decision govt order No 1

ఇటీవల ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద జీవో నెం.1ని హైకోర్టు సస్పెండ్ చేయడంపై టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు స్పందించారు. హైకోర్టు జీవో నెం.1ని సస్పెండ్ చేయడం రాష్ట్రంలోని ప్రజాస్వామ్యవాదులందరికి సంక్రాంతి పండుగ లాంటిదని అభివర్ణించారు. 

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉన్న జీవో నెంబర్ 1ను ప్రజాస్వామ్యవాదులందరూ వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇటువంటి సమయంలో హైకోర్టు ఈ జీవోను సస్పెండ్ చేయడం హర్షించదగ్గ పరిణామం అని పేర్కొన్నారు. ఈ సస్పెన్షన్ తాత్కాలికమైనప్పటికీ కోర్టులు జీవోను తప్పు పట్టడమనేది సిగ్గుచేటుగా భావించాలని అన్నారు. 

"జగన్ ఇచ్చిన జీవో నెం.1లో చట్టాన్ని ఎలా ఉపయోగించాలనేది స్పష్టంగా పేర్కొనలేదు. 1861 యాక్ట్ అనేది దేశ సమగ్రతకు, లా అండ్ ఆర్డర్ కు ఇబ్బంది. దీన్ని సమావేశాలకు ఇబ్బంది వచ్చినప్పుడు గతంలో వాడేవారు. జగన్... ప్రతిపక్ష నాయకులపై ఒక ఆయుధంగా ఈ యాక్టును వాడారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై, మున్సిపల్, పంచాయతీ రోడ్లపై సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదనడం ఎంతవరకు సమంజసం? ఒకవేళ చేయదలచుకుంటే పర్మిషన్ తీసుకోవాలనడం ఇబ్బందులు పెట్టడమే. సభలు, సమావేశాలకు అనుమతి తీసుకున్నా... వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది. రోడ్లమీద సాధ్యంకాని పరిస్థితుల్లో ప్రభుత్వం చూపిన ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే సభలు పెట్టుకోవాలి. ఇది జీవో సారాంశం. 

జగన్ ఎక్కడికైనా వెళితే బారికేడ్లు, పరదాలు కట్టడం అతనిలోని భయాన్ని బట్టబయలు చేస్తోంది. ఇలా ప్రపంచంలో ఎక్కడా లేదు. నార్త్ కొరియాలో కిమ్ ఎక్కడైనా బహిరంగ ప్రదేశాలకు సభలకు వెళితే సెక్యురిటీ కూడా ఉండేదికాదు. 

జగన్ అధికారంలోకి రాక మునుపు సందుల్లో, గొందుల్లో కొన్ని వందల సభలు పెట్టారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాల పట్ల ప్రజలు చైతన్యవంతులయ్యారు, ప్రజా ఉద్యమానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వం దీన్ని ఓర్వలేక జీవో నెం.1 ఇచ్చింది. ఇప్పటికైనా ఈ జీవోను ఉపసంహరించుకోవాల్సిదిగా తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం" అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు.

  • Loading...

More Telugu News