KCR: మహబూబాబాద్ సభలో స్థానిక సంస్థలపై నిధుల వర్షం కురిపించిన సీఎం కేసీఆర్

  • మహబూబాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
  • జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవం
  • గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున నిధులు
  • మహబూబాబాద్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు
  • మిగతా మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు చొప్పున ప్రకటన
CM KCR attends Mahabubabad collectorate building inauguration

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు మహబూబాబాద్ లో జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో తాను మహబూబాబాద్, తిరుమలగిరి, వర్ధన్నపేట ప్రాంతాల్లో పర్యటించినప్పుడు పూర్తికాని కాలువల నిర్మాణం చూసి ఇక జన్మలో గోదావరి నీళ్లు రావని బాధపడేవాడ్నని తెలిపారు. 

మంచిర్యాల వద్ద, ములుగు ప్రాంతంలో గోదావరిని దాటుతున్న సమయంలో నదిలోకి చిల్లర డబ్బులు వేసి దండం పెట్టుకునేవాడ్నని, మా నేలపైకి ఎప్పుడు వస్తావు గోదావరి తల్లీ, మా కరవు ఎప్పుడు తీరుస్తావు అని ప్రార్థించేవాడ్నని వెల్లడించారు. కురవి వీరభద్రస్వామిని కూడా వేడుకున్నానని, తెలంగాణ వస్తే నేనే మీసాలు చేయించి నీకు సమర్పించుకుంటానని మొక్కుకున్నట్టు వివరించారు. మరి ఆయన దయ, మీరందరూ ఆనాడు చేసిన ఉద్యమం, మానుకోట రాళ్ల ఆశీర్వాద బలం తెలంగాణ సాకారమైందని, అనేక పనులు జరిగాయని సీఎం కేసీఆర్ తెలిపారు. 

"దాదాపు అన్ని జిల్లాల్లో ఇలాంటి కలెక్టరేట్ భవనాలు నిర్మించుకుంటున్నాం. మొన్నామధ్య పంజాబ్ స్పీకర్ వచ్చి మా దగ్గర మినిస్టర్ చాంబర్ కంటే మీ దగ్గర కలెక్టర్ చాంబరే బాగుందని మెచ్చుకున్నారు. మన తెలంగాణ మనకు వచ్చింది కాబట్టి ఇలాంటి అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం. 

మహబూబాబాద్ కూడా జిల్లా అయింది. ఇవాళ ఈ కలెక్టరేట్ భవనం ప్రారంభించుకుంటున్నందుకు అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నాను. ఆదివాసీలు, గిరిజన ప్రాంతాల్లోనూ వెలుగులు నిండాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలాంటి ప్రాంతాల్లో ప్రజలకు చేరువలో పాలన ఉండాలని భావించాం. 

రాష్ట్రం ఏర్పడకముందు కేవలం మూడ్నాలుగు మెడికల్ కాలేజీలు ఉండేవి. ఇప్పుడు 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చాలా జరగాలి. మహబూబాబాద్ వంటి మారుమూల ప్రాంతాలు ఇంకా అభివృద్ధి చెందేలా ఈ సందర్భంగా ఓ శుభవార్త చెబుతున్నా. మహబూబాబాద్ లో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తున్నా. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇక్కడ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభం అవుతుంది" అని కేసీఆర్ వివరించారు. 

మా తండాలో మా రాజ్యం అంటూ ఇక్కడి ప్రజలు 50 ఏళ్లు నినదించినా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని అన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీలు, గిరిజనుల ఆకాంక్షలను గుర్తించి గౌరవించిందని తెలిపారు. ఇవాళ తండాలన్నింటినీ గ్రామ పంచాయతీలుగా చేసుకున్నామని, గిరిజన బిడ్డలే సర్పంచిలై వారి తండాలను బాగుచేసుకున్నారని కేసీఆర్ వెల్లడించారు. 

ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా సర్పంచిలకు ఆయన తియ్యనికబురు చెప్పారు. సీఎం ప్రత్యేక నిధి నుంచి ప్రతి గ్రామపంచాయతీకి రూ.10 లక్షల నిధి అందజేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిధులతో ఆయా సర్పంచిల ద్వారానే అభివృద్ధి పనులు జరిపించాలని అధికారులను ఆదేశించారు. 

ఇక మహబూబాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు సీఎం నిధుల వర్షం కురిపించారు. మహబూబాబాద్, తొర్రూర్, డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీలు అభివృద్ధి పథంలో వెళ్లాలని కోరుకుంటున్నానని తెలిపారు. పెద్ద మున్సిపాలిటీ అయిన మహబూబాబాద్ కు రూ.50 కోట్లు, మిగతా మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు చొప్పున సీఎం ప్రత్యేక నిధి నుంచి కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. ఈ నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం అయ్యేలా స్థానిక ప్రజాప్రతినిధులతో అధికారులు సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని స్పష్టం చేశారు.

More Telugu News