who: నోయిడా కంపెనీ పిల్లల దగ్గు మందుపై డబ్ల్యూహెచ్ఓ అలర్ట్!

  • నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేల్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
  • ఉజ్బెకిస్థాన్ లో 18 మంది చిన్నారుల మరణంతో నిర్ణయం
  • ఇప్పటికే ఆ కంపెనీ లైసెన్స్ ను రద్దు చేసిన యూపీ సర్కార్
WHO Alert On 2 Indian Syrups After Uzbekistan Child Deaths

నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ దగ్గు మందులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీ తయారుచేసిన రెండు దగ్గు మందులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేవని హెచ్చరించింది. చిన్నపిల్లలకు ఆ మందులు వాడొద్దని సూచిస్తూ తన వెబ్ సైట్ ద్వారా అలర్ట్ చేసింది. ఇటీవల ఉజ్బెకిస్థాన్ లో దగ్గు మందు తాగిన 18 మంది చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకోవడం తెలిసిందే! ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ అలర్ట్ జారీ చేసింది.

మారియన్ బయోటెక్ తయారుచేసిన దగ్గు మందులు అంబ్రోనాల్, డాక్-1 మాక్స్ సిరప్ లు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేవని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఈ ఉత్పత్తుల నాణ్యత, భద్రతలకు సంబంధించి మారియన్ బయోటెక్ ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేదని తెలిపింది. చిన్నారుల మరణం తర్వాత ఉజ్బెకిస్థాన్ లోని నేషనల్ క్వాలిటీ కంట్రోల్ లేబరేటరీస్ నాణ్యత పరీక్ష చేపట్టిందని పేర్కొంది.

ఈ రెండు సిరప్ లలో డైథలీన్ గ్లైకోల్, ఇతిలీన్ గ్లైకోల్ చాలా ఎక్కువ పరిమాణంలో ఉన్నట్లు ఈ పరీక్షలలో తేలిందని వెల్లడించింది. దీంతో చిన్న పిల్లలకు ఈ మందులు వాడొద్దని ఉజ్బెకిస్థాన్ ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఉజ్బెకిస్థాన్ లో చిన్న పిల్లల మరణాల నేపథ్యంలో మారియన్ బయోటెక్ కంపెనీ లైసెన్సును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మందుల తయారీని వెంటనే నిలిపివేయాలని అప్పట్లోనే ఆదేశించింది.

More Telugu News