Zelenskyy: రష్యాను అడ్డుకుంటాం.. మూడో ప్రపంచ యుద్ధం రాదు: జెలెన్ స్కీ

Zelenskyy at Golden Globes Ukraine will stop Russian aggression there will be no 3rd world war
  • సమయం మించిపోయిందన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు
  • యుద్ధంలో ఎవరు గెలుస్తారో తేలిపోయిందని వ్యాఖ్య 
  • స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నట్టు వెల్లడి
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్ స్కీ ఏ చిన్న అవకాశాన్నీ జార విరుచుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల కూటముల (జీ20 సహా) వార్షిక సమావేశాల నుంచి చివరికి సినిమా అవార్డుల కార్యక్రమం వరకు.. ప్రతి వేదికపై ఉక్రెయిన్ వాణిని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 

 ఉక్రెయిన్ స్వాతంత్య్రం కోసం మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు చెప్పారు. యుద్ధం ఇంకా ముగిసిపోలేదన్నారు. ‘‘కానీ, సమయం మించిపోయింది. ఎవరు గెలుస్తారో తేలిపోయింది. అయినా కానీ, యుద్ధం, కన్నీళ్లు ఇంకా నిలిచే ఉన్నాయి. మనందరి ఉమ్మడి పోరాటం స్వేచ్ఛ కోసం, ప్రజాస్వామ్యం, జీవించే హక్కుకోసం’’ అని పేర్కొన్నారు. 

మొదటి రెండు ప్రపంచ యుద్ధాలను జెలెన్ స్కీ ప్రస్తావించారు. మూడో ప్రపంచ యుద్ధానికి అవకాశం లేదన్నారు. తమ భూభాగంలో రష్యా దురాక్రమణను అడ్డుకుంటామని ప్రకటించారు. యుద్ధంలో ఉక్రెయిన్ గెలిచిన నాడు ప్రపంచంలోని స్వేచ్ఛాకాముక ప్రజలు అందరూ సంబరాలు చేసుకుంటారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.
Zelenskyy
Ukraine president
Russian aggression
Golden Globes

More Telugu News