Pawan Kalyan: పవన్ అంటే నాకూ అభిమానమే.. కానీ ఆయన సీఎం కావాలని నాకెందుకుంటుంది?: మంత్రి కొట్టు సత్యనారాయణ

AP Minister Kottu Satyanarayana Slams Pawan Kalyan
  • కాపులు ముఖ్యమంత్రి కావాలనుకునే వారు పవన్ వెంట వెళ్తున్నారన్న మంత్రి
  • పవన్ బీజేపీని పెళ్లాడి టీడీపీతో కాపురం చేస్తానని అంటున్నారని ఎద్దేవా
  • పవన్-చంద్రబాబు మధ్య ఉన్నది అపవిత్ర పొత్తన్న మంత్రి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే తనకూ అభిమానమేనని ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఆ అభిమానం సామాజికవర్గం పరంగా వచ్చిందేనని అన్నారు. అయితే, తామందరం బాధపడేలా ఆయన వ్యవహరిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కాపులు ముఖ్యమంత్రి కావాలని అనుకునే వారు పవన్ వెంట వెళ్లి కేరింతలు కొడుతున్నారని, కానీ కాపుల్ని సీఎంగా చూడాలన్న ఆలోచన తనకెందుకు ఉంటుందని ప్రశ్నించారు. సచివాలయంలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 

చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ మధ్య ఉన్నది అపవిత్ర పొత్తు అన్న మంత్రి.. పవన్ బీజేపీని పెళ్లి చేసుకుని టీడీపీతో కాపురం చేస్తానని అంటున్నారని, ఆ పని చేసి కాపుల పరువు తీయొద్దని చెబుతున్నామని అన్నారు. పవన్ వ్యవహారశైలి చూసి .. ‘ఆయన్ను ఎవరికైనా చూపించడ్రా’ అంటూ జనం సినిమా డైలాగులు చెబుతున్నారని అన్నారు. జగన్ మళ్లీ సీఎం కాకుండా అడ్డుకోవడం చంద్రబాబు, పవన్ వల్ల కాదని మంత్రి తెగేసి చెప్పారు.

తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్‌లో చేరడంపై మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో ఉన్న వ్యాపారాలు, ఇబ్బందుల వల్లే ఆయన బీఆర్ఎస్‌లో చేరి ఉంటారని అన్నారు. దేవినేని అవినాశ్ వైసీపీలో ఎందుకున్నారో? వంగవీటి రాధా టీడీపీలో ఎందుకున్నారో విజయవాడ ప్రజల్ని అడిగితే చెబుతారని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News