Team India: శ్రీలంక కెప్టెన్ సెంచరీతో పోరాడినా విజయం టీమిండియాదే!

  • గువాహటిలో భారీ స్కోర్ల మ్యాచ్
  • తొలుత 7 వికెట్లకు 373 రన్స్ చేసిన భారత్
  • 8 వికెట్లకు 306 పరుగులే చేసి ఓటమిపాలైన శ్రీలంక 
  • షనక 108 నాటౌట్
  • ఉమ్రాన్ మాలిక్ కు 3 వికెట్లు
Team India won 1st ODI despite Sri Lanka skipper heroic century

గువాహటిలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా నెగ్గింది. ఈ భారీ స్కోర్ల మ్యాచ్ లో శ్రీలంకను 67 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 373 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (113) సెంచరీ సాధించగా, కెప్టెన్ రోహిత్ శర్మ 83, శుభ్ మాన్ గిల్ 70 పరుగులు చేశారు. 

అనంతరం 374 పరుగుల భారీ లక్ష్యఛేదనలో శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 306 పరుగులు చేసి ఓటమిపాలైంది. లంక సారథి దసున్ షనక అజేయ సెంచరీతో పోరాడినా ఫలితం దక్కలేదు. షనక 88 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 108 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. శ్రీలంక ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక 72, ధనంజయ డిసిల్వా 47 పరుగులు చేశారు.

ఓ దశలో శ్రీలంక 206 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి భారీ ఓటమి ముంగిట నిలిచింది. అయితే, షనక అనూహ్యరీతిలో విజృంభించి స్కోరును 300 మార్కు దాటించాడు. టీమిండియా బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3, మహ్మద్ సిరాజ్ 2, మహ్మద్ షమీ 1, హార్దిక్ పాండ్యా 1, యజువేంద్ర చహల్ 1 వికెట్ తీశారు. 

ఈ విజయంతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఈ నెల 12న కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది.

More Telugu News