Yanamala: చంద్రబాబు, పవన్ కలిస్తే తప్పేంటి? జగన్ వెళ్లి మోదీని కలవడంలేదా?: యనమల

  • ఇటీవల చంద్రబాబు, పవన్ సమావేశం
  • తీవ్ర విమర్శలు కురిపించిన వైసీపీ నేతలు
  • బాబు-పవన్ భేటీతో వైసీపీ నేతలు భయపడుతున్నారన్న యనమల
  • 2024లో 1983ను మించిన ప్రభంజనం ఉంటుందని ధీమా
Yanamala slams Jagan and YCP govt

చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీపై జగన్ రెడ్డి, వైసీపీ నేతలు భయాందోళనలకు గురవుతున్నారని, వారు చేస్తున్న కువిమర్శలే అందుకు నిదర్శనమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. చంద్రబాబును పవన్ కలవడంతో వారు అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. 

దేశవ్యాప్తంగా అనేక ప్రాంతీయ పార్టీలు మఖలో పుట్టి, పుబ్బలో కనుమరుగయ్యాయని, ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నందునే తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లుగా విరాజిల్లుతోందని యనమల తెలిపారు. 2024 ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం 1983 నాటికంటే ఘనంగా ఉంటుందని జగన్ రెడ్డి, ఆయన ప్రభుత్వానికి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. 

"జగన్మోహన్ రెడ్డి తన ఆస్తులు పెంచుకోవడానికి, కబ్జాల కోసమే వికేంద్రీకరణ అంటున్నాడు గానీ, ప్రజల కోసం కాదు. టీడీపీ మాండలిక విధానంతో పరిపాలన వికేంద్రీకరణకు అంకురార్పణ చేసింది. బీసీలకు తొలిసారి 20 శాతం రిజర్వేషన్లు, మహిళలకు తొలిసారి 9 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ దే. 

పవన్ కల్యాణ్ పార్టీ యాక్టివ్ గా ఉంది. ఆయన నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఏ పార్టీ అయినా ప్రజాక్షేత్రంలో నిలవాలంటే, ఎప్పటికప్పుడు యువతరం ఆలోచనలకు తగినట్టుగా మార్పు చెందాలి. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లపాటు కొనసాగిందంటే, దానికి కారణం ఎన్టీఆర్, చంద్రబాబుపై ప్రజలు చూపిన విశ్వసనీయతే. 

తమ ప్రభుత్వం పోతోందన్న ఆందోళన, భయంతోనే వైసీపీ చంద్రబాబు-పవన్ భేటీని తప్పుపడుతోంది. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన జగన్, ఆయన పార్టీ తీవ్రమైన నిరాశానిస్పృహల్లో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. 

చంద్రబాబు-పవన్ కల్యాణ్ కలిస్తే తప్పేంటి? జగన్ వెళ్లి మోదీని కలవడంలేదా? ఆయన అధికారికంగా ఢిల్లీ వెళ్లిన వివరాలే బయట పెట్టడం లేదు. చంద్రబాబు-పవన్ చర్చించుకున్న ఆంతరంగిక విషయాలు ఎందుకు బయట పెట్టాలి? తెలుగుదేశం-జనసేన కలిసి పోటీచేస్తాయా? లేక విడిగా పోటీచేస్తాయా? అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు ప్రజలకోసం విడివిడిగా పోరాడుతున్నవారు, రేపు భవిష్యత్ లో కలిసి పోటీచేయరని చెప్పలేం కదా?" అంటూ యనమల వ్యాఖ్యానించారు.

More Telugu News