Somesh Kumar: తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ను ఏపీకి బదలాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు

  • విభజన సమయంలో సోమేశ్ కుమార్ ఏపీకి కేటాయింపు
  • క్యాట్ ఉత్తర్వులతో తెలంగాణలో కొనసాగుతున్న వైనం
  • క్యాట్ ఉత్తర్వులు కొట్టివేసిన హైకోర్టు
  • ఈ నెల 12 లోగా ఏపీలో రిపోర్టు చేయాలన్న కేంద్రం
  • తెలంగాణ హైకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ ఉత్తర్వులు
Center issues orders to allocate Somesh Kumar to AP

తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ను రిలీవ్ చేస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. సోమేశ్ కుమార్ ను కేంద్రం ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12లోగా సోమేశ్ కుమార్ ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ కేంద్రం ఉత్తర్వులు వెలువరించింది. 

సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లిపోతున్న నేపథ్యంలో తెలంగాణ తదుపరి సీఎస్ ఎవరన్నదానిపై ఆసక్తినెలకొంది. కొత్త సీఎస్ రేసులో శాంతికుమారి, రజత్ కుమార్, రామకృష్ణారావు, అరవింద్ కుమార్, రాణి కుముదిని ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి రామకృష్ణారావును ఇన్చార్జి సీఎస్ గా నియమించే అవకాశాలున్నాయి. 

ఇక, సోమేశ్ కుమార్ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ సీఎస్ గా సోమేశ్ కుమార్ నియామకం అక్రమం అని ఆరోపించారు. ఈ విషయాన్ని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని వెల్లడించారు. సీఎస్ గా, ధరణి, సీసీఎల్ఏ, రెరా హెడ్ గా సోమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 

2014లో రాష్ట్ర విభజన జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ ను ఏపీకి కేటాయించినా, క్యాట్ ఉత్తర్వుల మేరకు ఆయన తెలంగాణలో కొనసాగుతున్నారు. దాంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో అప్పీల్ చేయగా, సోమేశ్ కుమార్ తెలంగాణలో కొనసాగడాన్ని హైకోర్టు రద్దు చేసింది. క్యాట్ ఉత్తర్వులను కొట్టివేసింది. కొన్ని నెలల కిందటే వాదనలు ముగిసినా, తీర్పును రిజర్వ్ లో ఉంచిన న్యాయస్థానం నేడు తన నిర్ణయాన్ని వెల్లడించింది. 

కాగా, తీర్పు అమలుకు 3 వారాల గడువు ఇవ్వాలని సోమేశ్ కుమార్ న్యాయవాది హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. అయితే సోమేశ్ కుమార్ న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు చీఫ్ జస్టిస్ తోసిపుచ్చారు. సర్టిఫైడ్ ఆర్డర్ కాపీ రాగానే ఏపీ క్యాడర్ కు వెళ్లాలని సోమేశ్ కుమార్ కు సూచించారు.

More Telugu News