Go First Air: 50 మంది ప్రయాణికులను వదిలేసి వెళ్లిపోయిన ఎయిర్ లైన్స్ సంస్థపై విచారణకు ఆదేశం

  • బెంగళూరు ఎయిర్ పోర్టులో ఘటన
  • ఒక బస్సులోని ప్రయాణికులను వదిలేసి పోయిన విమానం
  • నాలుగు గంటల తర్వాత మరో విమానం ఏర్పాటు చేసిన సంస్థ
50 Plane Passengers Forgotten On Bus

బెంగళూరు నుంచి బయల్దేరిన గో ఫస్ట్ ఎయిర్ వేస్ విమానం... విమానాశ్రయంలో బస్సులో ఉన్న 50 మంది ప్రయాణికులను ఎక్కించుకోకుండానే టేకాఫ్ అయిన ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. ఈ నిర్లక్ష్యంపై వివరణ ఇవ్వాలని సదరు ఎయిర్ లైన్స్ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. తమను వదిలేసి పోవడంపై బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా సదరు ఎయిర్ లైన్స్ సంస్థపై విరుచుకుపడ్డారు. ఒక భయంకరమైన అనుభవం అని విమర్శించారు.

నిన్న ఉదయం 6.30 గంటల సమయంలో బెంగళూరులోని కెంపేగౌడ ఇటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఈ ఘటన సంభవించింది. విమానంలోకి ఎక్కాల్సిన ప్రయాణికులను నాలుగు బస్సులలో రన్ వే వద్దకు తీసుకెళ్లారు. అయితే, ఒక బస్సులోని ప్రయాణికులను మాత్రం కిందకు దించలేదు. వారు బస్సులో వేచి చూస్తున్న సమయంలోనే విమానం టేకాఫ్ అయింది. దీంతో ఫ్లైట్ మిస్ అయిన ప్రయాణికులు ఈ విషయాన్ని సదరు ఎయిర్ లైన్ సంస్థ, ప్రధాని మోదీ, విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేశారు. 

మరోవైపు ఫ్లైట్ మిస్ అయిన ప్రయాణికుల లగేజీ మొత్తం చెకిన్ కావడం గమనార్హం. అయితే, జరిగిన పొరపాటును గమనించిన ఎయిర్ లైన్స్ అధికారులు నాలుగు గంటల తర్వాత వారికి మరో విమానాన్ని ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన ఎయిర్ లైన్స్ పై డీజీసీఏ సీరియస్ అయింది. విచారణకు ఆదేశించింది.

More Telugu News