Rahul Gandhi: రాహుల్ జోడో యాత్ర భద్రతకు పంజాబ్ పోలీసుల ప్రత్యేక దళం

  • ప్రస్తుతం హర్యానాలో పాదయాత్ర చేస్తున్న రాహుల్
  • హర్యానా నుంచి పంజాబ్ చేరుకోనున్న కాంగ్రెస్ అగ్రనేత
  • ఇటీవల జోడో యాత్రలో భద్రత ఉల్లంఘనలు జరిగాయంటూ కేంద్రానికి కాంగ్రెస్ లేఖ
Punjab Police forms special squad to provide protection to Rahul Gandhis Bharat Jodo Yatra

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర భద్రత విషయంలో ప్రతిపక్ష, అధికార పక్షాల మధ్య వివాదం నెలకొంది. రాహుల్ భద్రత విషయంలో కేంద్రం రాజీ పడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఢిల్లీలో భద్రతా ఉల్లంఘనలు జరిగాయంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. అయితే నిబంధనల ప్రకారం భద్రత ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్పారు. 

ప్రస్తుతం హర్యానాలో కొనసాగుతున్న రాహుల్ యాత్ర తదుపరి సున్నితమైన పంజాబ్‌ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. పంజాబ్ మీదుగా ఆయన ఎనిమిది రోజుల పాటు పాదయాత్ర చేస్తారు. ఈ నేపథ్యంలో యాత్ర సజావుగా సాగేలా పంజాబ్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్ర అంతటా విధుల్లో ఉండే ఏడీజీపీ ర్యాంక్ అధికారి, ఏఐజీ ర్యాంక్ అధికారితో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసినట్లు పంజాబ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) సుఖ్‌చైన్ గిల్ తెలిపారు.

‘రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశాం. ఏడీజీపీ ఎస్‌ఎస్‌ శ్రీవాస్తవ పర్యవేక్షణ అధికారిగా ఉంటారు. రాహుల్ గాంధీకి తగిన భద్రత కల్పించాలని అన్ని జిల్లాల్లోని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సీనియర్ పోలీసు సూపరింటెండెంట్‌లకు ఆదేశాలు జారీ చేశాం’ అని తెలిపారు. రాహుల్ భద్రత కోసం ఎంత మంది పోలీసులను నియమించారో ఐజీపీ ప్రకటించనప్పటికీ, కాంగ్రెస్ నేతకు రక్షణ వలయంలా కనీసం 150 మంది పంజాబ్ పోలీసు సిబ్బంది ఉంటారని తెలుస్తోంది. 

భారత్ జోడో యాత్ర రాష్ట్రం గుండా సజావుగా సాగేలా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా పోలీసులను కోరారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను అందించే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తో పంజాబ్ పోలీసులు సమన్వయం చేసుకుంటారని ఐజీపీ తెలిపారు. కాగా, రాహుల్ గాంధీని పంజాబ్‌లోకి రాకుండా అడ్డుకుంటే పది లక్షల డాలర్ల బహుమతి ఇస్తామని సిక్ ఫర్ జస్టిస్ గ్రూప్ ప్రకటించింది. రాహుల్ పంజాబ్‌లో అడుగు పెడితే రాష్ట్రంలో హింస చోటు చేసుకుంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తం అయ్యారు.

More Telugu News