Rahul Gandhi: 21 వ శతాబ్దంలో కౌరవులు ఖాకీ లాగులతో తిరుగుతున్నారు: రాహుల్ గాంధీ

  • భారత్ జోడో యాత్రలో ఆర్ఎస్ఎస్ పై రాహుల్ విమర్శలు
  • దేశంలోని ఇద్దరు, ముగ్గురు బిలియనీర్లు వాళ్లకు మద్దతిస్తున్నారని ఆరోపణ
  • మహాభారత యుద్ధం ఇప్పుడు కూడా కొనసాగుతోందన్న కాంగ్రెస్ అగ్రనేత   
21st Century Kauravas Wear Khakhi Half Pants says Rahul Gandhi

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) పై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. 21 వ శతాబ్దంలో కౌరవులు ఖాకీ లాగులు తొడుక్కుని, చేతిలో లాఠీతో తిరుగుతున్నారని ఆరోపించారు. శాఖల పేరుతో వాళ్లు సమావేశాలు నిర్వహిస్తుంటారని, దేశంలోని ఇద్దరు ముగ్గురు బిలియనీర్లు ఈ కౌరవులకు మద్దతుగా నిలబడుతున్నారని ఆయన ఆరోపించారు. సోమవారం సాయంత్రం జోడో యాత్ర హర్యానాలోని అంబాలా జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు.

పాండవుల పాలన ప్రజారంజకంగా ఉండేదని రాహుల్ గాంధీ చెప్పారు. ఈ నేలపై ద్వేషాన్ని వ్యాపింపజేసే పనులను పాండవులు అసహ్యించుకున్నారని వివరించారు. నోట్ల రద్దు, తప్పుడు జీఎస్టీ వంటి పనులు వాళ్లు ఎన్నడూ చేయలేదని అన్నారు. ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల సామాన్య జనం ఇబ్బందులు పడతారని తెలుసు కాబట్టే పాండవులు ఈ నిర్ణయాలు తీసుకోలేదని రాహుల్ చెప్పారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం రైతులకు నష్టం చేస్తాయని తెలిసీ వ్యవసాయ చట్టాలపై సంతకాలు చేశారని అన్నారు.

మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. ఈ చట్టాల తయారీ వెనక మోదీ బిలియనీర్ మిత్రులే ఉన్నారని, వాళ్లే ఆయనతో సంతకాలు చేయించారని రాహుల్ ఆరోపించారు. ప్రజలకు అర్ధం కాకపోవచ్చు కానీ అప్పుడు కౌరవులు, పాండవుల మధ్య మహాభారత యుద్ధం జరిగినట్లే ఇప్పుడు కూడా యుద్ధం జరుగుతోందని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ఖాకీ లాగులు తొడుక్కుని తిరుగుతున్న కౌరవులకు, అన్ని వర్గాల ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందని రాహుల్ తెలిపారు.

More Telugu News