Uttar Pradesh: అలిగిన భార్యను బుజ్జగించేందుకు సెలవు కావాలన్న కానిస్టేబుల్.. ఐదు రోజుల సెలవిచ్చిన ఏఎస్పీ

  • ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో ఘటన
  • పెళ్లయిన కొన్ని రోజులకే భార్యను వదిలి విధుల్లో చేరిన కానిస్టేబుల్
  • ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అలిగిందని నిర్ధారణ
  • ఆమెను బుజ్జగించేందుకు వారం రోజులు సెలవు కావాలని సెలవు చీటీ
  • ఐదు రోజుల సెలవు మంజూరు చేసిన ఏఎస్పీ
up constable leave letter gone viral on social media

అలిగిన తన భార్యను బుజ్జగించేందుకు సెలవు కావాలంటూ తనపై అధికారికి ఓ కానిస్టేబుల్ రాసిన లీవ్ లెటర్ సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ గౌరవ్ చౌధరికి గతేడాది డిసెంబరులో వివాహమైంది. పెళ్లయిన కొన్ని రోజులకే భార్యను ఇంటి వద్ద వదిలి డ్యూటీలో తిరిగి చేరాడు. ఆ తర్వాతి నుంచి మళ్లీ ఇంటికి వెళ్లలేదు. దీంతో భర్తపై అలిగిన ఆమె ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం మానేసింది.

దీంతో భార్య తనపై అలిగిందని నిర్ధారణ కొచ్చిన గౌరవ్ సెలవుపెట్టి ఇంటికెళ్లి ఆమెను బుజ్జగించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన పై అధికారి అయిన ఏఎస్పీకి లీవ్ లెటర్ రాస్తూ.. పెళ్లయిన వెంటనే తన భార్యను వదిలి వచ్చినందుకు ఆమె తనపై అలిగిందని, ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఫోన్ కట్ చేస్తోందని, కొన్నిసార్లు ఫోన్ ఎత్తినా మాట్లాడమని ఆమె తల్లికి ఇస్తోందని వాపోయాడు. 

కాబట్టి అలిగిన తన భార్యను బుజ్జగించేందుకు తనకు వారం రోజుల సెలవు కావాలని ఆ లీవ్ లెటర్‌లో విజ్ఞప్తి చేశాడు. ఆ లేఖ చూసి గౌరవ్ బాధను అర్థం చేసుకున్న ఏఎస్పీ ఐదు రోజుల సెలవు మంజూరు చేశారు. ఇప్పుడీ లీవ్ లెటర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

More Telugu News