Diabetes: మధుమేహులకు కొన్ని పండ్లు మంచివి.. కొన్నింటితో హాని?

  • ఏ పండ్లు అయినా తినొచ్చు
  • గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నవి మంచివి
  • జీఐ ఎక్కువగా ఉన్నవి తక్కువగా తీసుకోవాలి
  • యాపిల్, జామ, కమలా, బొప్పాయి, పుచ్చ మంచివి
 Diabetes best and worst fruits for managing blood sugar

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ రోజువారీ ఆహారంలో భాగంగా తప్పకుండా పండ్లు తీసుకోవాలి. కానీ, మధుమేహం ఉన్నవారు ఏ పండ్లు తీసుకోవాలి? అన్న సందేహాన్ని ఎప్పుడూ ఎదుర్కొంటుంటారు. ఎందుకంటే పండ్లలో ఫ్రక్టోస్ అనే తీపి పదార్థం ఉంటుంది. దీంతో రక్తంలో షుగర్ పెరిగిపోతుందేమోనన్న భయం వారిని వేధిస్తుంటుంది. నిజానికి రోజువారీ పండ్లు తీసుకుంటే మధుమేహం రిస్క్ తగ్గుతుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. 

అలా అని చెప్పి అన్ని రకాల పండ్లు తినేస్తానంటే కుదరదు. ఎందుకంటే కొన్ని పండ్లలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే తిన్న వెంటనే వేగంగా జీర్ణమై, రక్తంలోకి చక్కెరలు వేగంగా విడుదల అవుతుంటాయి. అందుకని గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న పండ్లను మధుమేహులు తినాల్సి ఉంటుంది. జీఐ తక్కువగా ఉన్న పండ్లు నిదానంగా జీర్ణమవుతూ, రక్తంలోకి క్రమంగా చక్కెరలు విడుదల చేస్తాయి. గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న పండ్లను తినొచ్చు కానీ, పరిమితంగానే అని మర్చిపోవద్దు. 

ముఖ్యంగా మధుమేహులు 150-200 గ్రాముల వరకు పండ్లను తినొచ్చు. ఒకవేళ షుగర్ అధికంగా ఉంటే కనుక పండ్ల పరిమాణం 100-150 గ్రాములకు తగ్గించుకోవాలి. గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న పండ్లను కూడా తినొచ్చు. కానీ, వాటి పరిమాణం 100 గ్రాములు మించకూడదు. ఇక మధుమేహంతో బాధపడేవారు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ తో కలిపి పండ్లు తినకూడదు. ఎందుకంటే టిఫిన్, భోజనంతో కార్బోహైడ్రేట్లు అధికంగా మన రక్తంలోకి చేరతాయి. వీటికి కార్బోహైడ్రేట్లు ఉండే పండ్లను జోడించుకోవడం మంచి ఐడియా కాదు. కనుక టిఫిన్, మధ్యాహ్నం లంచ్ కు మధ్య, మధ్యాహ్నం లంచ్ నుంచి రాత్రి డిన్నర్ కు మధ్య తీసుకోవచ్చు. కావాలంటే పండ్లతో నట్స్ ను కలిపి తీసుకోవడం కూడా మంచి ఐడియానేనన్నది నిపుణుల సూచన. పండ్లు పీనట్స్ కూడా ఒకేసారి తినొచ్చు. 

ముధుమేహంతో ఉన్నవారు యాపిల్, జామపండు, కమలా/నారింజ, బొప్పాయి, వాటర్ మెలన్ తీసుకోవచ్చు. ఇవి చాలా మంచివి. వీటిల్లో ఫ్యాట్, క్యాలరీలు, సోడియం చాలా తక్కువ. పైగా వీటిల్లో విటమిన్ సీ, పొటాషియం, పీచు లభిస్తాయి. పొటాషియం రక్తపోటుని నియంత్రిస్తుంది. కణజాల నిర్మాణానికి, మరమ్మతులకు విటమిన్ సీ కావాలి. పళ్ల చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలన్నా విటమిన్ సీ అవసరం. బీ విటమిన్లు యాపిల్, మెలన్ పండ్లు, బొప్పాయిలో లభిస్తాయి. పండ్ల రసం కంటే మొత్తం పండుగా తినాలి. దీనివల్ల పీచు లభించి జీర్ణ ప్రక్రియకు సాయపడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.

వీటిని తగ్గించాలి..
మధుమేహం ఉన్న వారు సపోటా, మామిడి పండు, అరటి పండు, ద్రాక్ష పండ్లు, ఎట్టి పరిస్థితుల్లోనూ తినొద్దు. పనస తొనలు చాలా తక్కువగా తినాలి.

More Telugu News