T20 World Cup: కోహ్లీ మళ్లీ అలాంటి షాట్ ఆడగలడని అనుకోను: పాక్ బౌలర్ హరీస్ రవూఫ్

Dont Think He Can Do That Again Haris Rauf Opens Up On Virat Kohlis T20 World Cup Six
  • గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో నిరాశ పరిచిన భారత్
  • పాకిస్థాన్‌తో జరిగిన సూపర్-12 మ్యాచ్‌లో జట్టును గెలిపించిన కోహ్లీ
  • హరీస్ రవూఫ్ బౌలింగులో రెండు బ్యాక్‌ టు బ్యాక్ సిక్సర్లు
  • అందులో ఒకటి అత్యంత అరుదైన షాట్
  • ఆ షాట్ తనను బాధించిందన్న పాక్ క్రికెటర్
గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా తీవ్రంగా నిరాశపరిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో దారుణంగా ఓటమి పాలైన భారత జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకుముందు సూపర్-12 దశలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు అనూహ్య విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థిపై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత ఓటమి దిశగా సాగిన జట్టును మాజీ సారథి విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆదుకున్నాడు. కనీవినీ ఎరుగని ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో కోహ్లీ తన అనుభవాన్నంతా రంగరించి జట్టుకు అపూర్వ విజయాన్ని అందించిపెట్టాడు. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ 53 బంతుల్లో అజేయంగా 82 పరుగులు చేశాడు. 

ఈ మ్యాచ్‌లో 19వ ఓవర్ వేసిన పేసర్ హరీస్ రవూఫ్ బౌలింగులో కోహ్లీ రెండు వరుస సిక్సర్లు బాదడాన్ని అభిమానులు మర్చిపోలేరు. ఇందులో మొదటి సిక్సర్ అత్యద్భుతం. గ్రౌండ్ మీదుగా స్ట్రెయిట్ డౌన్ షాట్ ఆడిన తర్వాత కొట్టిన ఈ సిక్సర్‌ అప్పట్లో టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. మాజీ క్రికెటర్లు కూడా ఈ సిక్సర్‌పై కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తారు.   

పాకిస్థాన్ పాప్యులర్ టీవీ షో ‘హస్నా మానా హై’లో పాల్గొన్న హరీస్ రవూఫ్‌ను ఈ సిక్సర్‌పై ఓ అభిమాని ప్రశ్నించాడు. దీనికి రవూఫ్ బదులిస్తూ ఇలాంటి షాట్లు క్రికెట్‌లో చాలా అరుదని, ఇలాంటి షాటును కోహ్లీ కూడా మళ్లీ ఆడలేడని బదులిచ్చాడు. ఆ షాట్ గురించి తాను ఏమీ చెప్పలేనని, కాకపోతే అది వ్యక్తిగతంగా తనను బాధించిందని పేర్కొన్నాడు. అయితే, కోహ్లీ మళ్లీ అలాంటి షాట్ కొట్టగలడని తాను అనుకోవడం లేదని అన్నాడు. ఇలాంటివి క్రికెట్‌లో చాలా అరుదని పేర్కొన్నాడు. వాటిని మళ్లీమళ్లీ కొట్టలేరని చెప్పుకొచ్చాడు. కోహ్లీ టైమింగ్ పక్కాగా ఉండడంతోనే ఆ బంతి స్టాండ్స్‌లోకి వెళ్లిందని రవూఫ్ వివరించాడు.
T20 World Cup
Virat Kohli
Haris Rauf
Kohli Sixer
Hasna Mana Hai

More Telugu News