Air India: అవును పొరపాటే.. విమానంలో వృద్ధురాలిపై మూత్ర విసర్జన ఘటనపై ఎట్టకేలకు ఎయిరిండియా స్పందన

  • విమర్శలు చుట్టుముట్టడంతో స్పందించిన చంద్రశేఖరన్
  • ఘటనపై తగిన రీతిలో స్పందించలేకపోయామని ఆవేదన 
  • ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఎయిరిండియా సీఈవో క్యాంప్‌బెల్
Matter of personal anguish Tata Sons reacts to urination incident onboard Air India flight

న్యూయార్క్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో సహచర ప్రయాణికురాలిపై తాగిన మత్తులో ఓ వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటనపై టాటా సన్స్ ఎట్టకేలకు స్పందించింది. ఈ విషయంలో తాము మరింత వేగంగా స్పందించి ఉండాల్సిందని టాటాసన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అన్నారు. ఈ ఘటన తనకు, తన సహోద్యోగులకు వ్యక్తిగతంగా తీవ్ర వేదన కలిగించిందన్నారు. ఈ ఘటనపై తాము మరింత వేగంగా స్పందించి ఉంటే బాగుండేదని, కానీ తాము తగిన రీతిలో స్పందించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

గతేడాది నవంబరు 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిరిండియా విమానం ‘ఏఐ 102’లో లైట్లు ఆపివేసిన తర్వాత మద్యం మత్తులో ఉన్న శంకర్ మిశ్రా అనే ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలైన వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఢిల్లీ పోలీసులకు ఆమె తాజాగా ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చి కలకలం రేపింది. 

ఈ ఘటనపై బాధిత మహిళ చంద్రశేఖరన్‌కు లేఖ రాసినా స్పందించకపోవడం, విమాన సిబ్బంది సరిగా వ్యవహరించకపోవడంతో ఎయిరిండియాపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన ఎయిరిండియా శంకర్ మిశ్రాపై 30 రోజుల ట్రావెల్ బ్యాన్ విధించి చేతులు దులుపుకుంది. అంత పెద్ద తప్పునకు ఇంత చిన్న శిక్షా? అంటూ మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా, చంద్రశేఖరన్ స్పందించారు. ఈ విషయంలో తాము మరింత వేగంగా స్పందించి ఉండాల్సిందని పేర్కొన్నారు.

కాగా, ఘటన తర్వాత పరారైన శంకర్ మిశ్రాను బెంగళూరులో అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు ఆయనను పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. మరోవైపు, ఎయిరిండియా సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మరోమారు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. కాగా, విషయం వెలుగులోకి రావడంతో శంకర్ మిశ్రా వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న అమెరికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ వెల్స్ ఫార్గో అతడిని విధుల నుంచి తొలగించింది.

More Telugu News