Chandrababu: చంద్రబాబు, పవన్ భేటీపై వైసీపీ నేతల విమర్శలు... సోమిరెడ్డి కౌంటర్

  • చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సమావేశం
  • ముసుగు తొలగిపోయిందన్న వైసీపీ నేతలు
  • ప్రజలు గట్టిగా బుద్ది చెబుతున్నారని స్పష్టీకరణ
  • వైసీపీ నేతలకు ప్యాంట్లు తడిచిపోతున్నాయన్న సోమిరెడ్డి
Somireddy counters YCP leaders comments

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ భేటీ కావడంపై వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. 

సంక్రాంతి పండుగ మామూళ్ల కోసం దత్తతండ్రి చంద్రబాబు వద్దకు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ వెళ్లాడని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. "చంద్రబాబుకు ఎలా అవసరం అయితే అలా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నావన్నది బహిరంగ రహస్యమే. ఇంకా ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట? ముసుగు తీసేయండయ్యా... జనాలు కూడా మీ ఇద్దరికీ కలిపి గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు" అంటూ అమర్నాథ్ ట్వీట్ చేశారు. 

మల్లాది విష్ణు స్పందిస్తూ... చంద్రబాబు, పవన్ ముసుగు తొలగిపోయిందని పేర్కొన్నారు. పవన్, చంద్రబాబుల కలయికతో ఏపీకి ఒరిగేదేమీలేదని అభిప్రాయపడ్డారు. అటు, మంత్రి అంబటి రాంబాబు కూడా ఈ భేటీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించడం తెలిసిందే. 

కాగా, వైసీపీ నేతల విమర్శల పట్ల టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. "చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీతో వైసీపీ నేతలు, మంత్రులకు ప్యాంట్లు తడిచిపోతున్నట్టున్నాయి... ఎందుకైనా మంచిది, ముందు జాగ్రత్తగా డైపర్స్ వాడండి" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

More Telugu News