ghulam nabi azad: జమ్మూ కశ్మీర్ లో ఆజాద్ కు షాకిచ్చిన విధేయులు

Ahead of Bharat Jodo entering Jammu and Kashmir 17 Ghulam Nabi Azad loyalists rejoin Congress
  • తిరిగి కాంగ్రెస్ లోకి 17 మంది కీలక నేతలు
  • భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో ప్రవేశించేముందు కీలక పరిణామం
  • జోడో యాత్రలో పాల్గొననున్న ఫరూక్, ముఫ్తి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ జమ్మూ కశ్మీర్ లో ప్రవేశించే ముంగిట ఆ పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. గతేడాది అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్ ను వీడి జమ్మూ కశ్మీర్ లో కొత్త పార్టీ పెట్టిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కు షాక్ తగిలింది. ఆజాద్ స్థాపించిన డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ (డీఏపీ) లో చేరిన ఆయన విధేయులు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. 

జమ్మూ కశ్మీర్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్, మాజీ మంత్రి పీర్జాదా మొహమ్మద్ సయీద్ సహా 17 మంది కీలక నేతలు కాంగ్రెస్‌ పార్టీలోకి తిరిగొచ్చారు. చాంద్, బల్వాన్ సింగ్‌ గులాం నబీ ఆజాద్‌కు విధేయులు. ఆజాద్ తో పాటు కాంగ్రెస్‌ను వీడిన వీరు ఆయన నెలకొల్పిన డీఏపీలో చేరారు. అయితే, రాష్ట్రంలో డీఏపీ సెక్యులర్ ఓట్లను చీల్చే ప్రమాదం ఉందని, దానివల్ల బీజేపీ బలోపేతం అవుతుందని భావించిన నేతలు తిరిగి సొంత గూటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 

వీరంతా ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేజీ వేణుగోపాల్‌, జైరాం రమేశ్‌, ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ రజనీ పాటిల్‌ సమక్షంలో తిరిగి సొంత గూటికి వచ్చారు. ఆజాద్ తో స్నేహం వల్లే కాంగ్రెస్ ను వీడి తాము తప్పు చేశామని నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

భారత్ జోడో యాత్ర మరికొన్ని రోజుల్లో జమ్మూ కశ్మీర్ లో ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. నేషనలిస్ట్ కాంగ్రెస్, పీడీపీ అధినేతలు ఫరూక్ అబ్దులా, మెహబూబా ముఫ్తీ.. శ్రీనగర్ లో ఈ యాత్రలో రాహుల్ తో కలిసి నడుస్తామని ప్రకటించారు. దాంతో, జమ్మూ కశ్మీర్ లో రాజకీయ పరిణామాలన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగా మారబోతున్నాయి. కొత్త పార్టీతో ముందుకెళ్లాలని చూసిన ఆజాద్ కు, అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీకి ఇది మింగుడు పడబోదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ghulam nabi azad
Jammu And Kashmir
congress
re jion
Bharat Jodo yatra
Rahul Gandhi

More Telugu News