Vasireddy Padma: ఏలూరు జిల్లాలో యువతిపై ప్రేమోన్మాది దాడి దురదృష్టకరం: వాసిరెడ్డి పద్మ

  • ఏలూరు జిల్లాలో ఉన్మాద చర్య
  • ప్రేమను అంగీకరించలేదని యువతిపై దాడి
  • అడ్డువచ్చి కుటుంబసభ్యులపైనా దాడి
  • బాధితురాలిని పరామర్శించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్
Vasireddy Padma condemns Eluru incident

ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపోలు గ్రామంలో గాజులపాటి కల్యాణ్ అనే వ్యక్తి తన ప్రేమను అంగీకరించలేదని మాణిక్యం అనే యువతిపైనా, ఆమె కుటుంబసభ్యులపైనా దాడి చేశాడు. ఈ ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఖండించారు. 

ఆమె నేడు ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. దాడికి దారితీసిన సంఘటనల పూర్వాపరాలను కల్యాణి కుటుంబ సభ్యులను, పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో వేగంగా దర్యాప్తు జరపాలన్నారు. ఈ విషయంపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో వాసిరెడ్డి పద్మ ఫోన్లో మాట్లాడారు. ఆ ప్రేమోన్మాదిపై హత్యా ప్రయత్నం కింద కేసు పెట్టడంతోపాటు రౌడీ షీట్ కుడా తెరవాలని జిల్లా ఎస్పీని కోరామని ఆమె తెలిపారు.  బాధిత కుటుంబానికి ప్రభుత్వం మహిళా కమిషన్ అండగా ఉంటుందన్నారు. 

మాణిక్యం డిగ్రీ పూర్తి చేసి, తాడేపల్లి గూడెంలో కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటోందని ఈ సమయంలో తనను కళ్యాణ్ అనే యువకుడు వేధిస్తున్న విషయాన్ని ఆమె తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకువచ్చిందని వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. వారు కళ్యాణ్ ను పలుమార్లు మందలించడంతోపాటు అతడి కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగిందన్నారు.

అయినా తీరు మార్చుకోని యువకుడు యువతిపై అక్కసు పెంచుకున్నాడన్నారు. అదే విధంగా గతంలో వారి గడ్డి వాములు సైతం తగలబెడితే పెద్దలకు చెప్పి మందలించారన్నారు. అయితే గురువారం అర్ధరాత్రి విద్యుత్ నిలిపివేసి పథకం ప్రకారం మాణిక్యం, ఆమె కుటుంబసభ్యులపై యువకుడు దాడికి దిగాడని వాసిరెడ్డి పద్మ తెలిపారు. 

యువతి దవడ, మెడ తదితర భాగాల్లో కత్తితో తీవ్రంగా గాయపర్చాడని అన్నారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతికి, ఆమె తల్లి, సోదరికి మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ఆమె మొహంపై చిన్న మచ్చ కూడా లేకుండా ప్రభుత్వ సాయంతో పూర్తి వైద్యం సదుపాయం కల్పిస్తున్నామన్నారు. కాగా ఈ ఘటనలో నిందితుడు గాజులపాటి కల్యాణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

More Telugu News