High Blood Pressure: ఈ పానీయాలతో హైబీపీని అదుపులో ఉంచుకోవచ్చట!

  • జీవనశైలి ఆరోగ్య సమస్యల్లో ప్రమాదకరమైనది హైబీపీ
  • ఓ స్థాయికి మించితే రక్తపోటుతో ముప్పు
  • ఇతర దుష్ఫలితాలకు దారితీసే అవకాశం
  • పలు పానీయాలతో అధిక రక్తపోటు కట్టడి
These juices and drinks can reduce high blood pressure

మనుషుల్లో రక్తపోటు 120/80 ఉంటే అది ఆరోగ్యకరమైన విషయమే. 140/90కి మించితే మాత్రం దాన్ని అధిక రక్తపోటు (హైబీపీ)గా పరిగణిస్తారు. వివిధ కారణాలతో హైబీపీ సమస్య ఏర్పడుతుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. గుండెపోటు, పక్షవాతం, మెదడులో రక్తస్రావం వంటి దుష్పరిణామాలు చోటుచేసుకుంటాయి. హైబీపీకి మందులు ఉన్నప్పటికీ, సహజసిద్ధ రీతిలో దీన్ని అదుపులో ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకోసం కొన్ని పానీయాలు సూచిస్తున్నారు. ఆ పానీయాలను తీసుకోవడం ద్వారా హైబీపీని అదుపులో ఉంచుకోవచ్చని, తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెబుతున్నారు. 


1. బీట్ రూట్ జ్యూస్
బీట్ రూట్ లను పచ్చిగా గానీ, ఉడికించి గానీ జ్యూస్ చేసుకుని తాగితే హైబీపీ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ జ్యూస్ రక్తప్రసరణను సాఫీగా జరిగేలా ఉపయోగపడుతుంది. రోజూ 250 మి.లీ బీట్ రూట్ జ్యూస్ తీసుకునేవారిలో సిస్టోలిక్, డయాస్టోలిక్ రక్తపోటు నియంత్రణలో ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. బీట్ రూట్ లో అధికస్థాయిలో నైట్రేట్స్ ఉంటాయి. వీటిని శరీరం నైట్రిక్ ఆక్సైడ్ గా మార్చుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను వదులుగా చేస్తుంది. దాంతో రక్తం సాఫీగా ప్రసరిస్తుంది. 

2. టమాటా జ్యూస్
టమాటా జ్యూస్ కూడా హైబీపీని కంట్రోల్ చేసే శక్తిని కలిగి ఉంటుంది. ఇది హైబీపీని మాత్రమే కాదు ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ పైనా ప్రభావం చూపిస్తుంది. టమాటా జ్యూస్ లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, అధిక రక్తపోటు ముప్పును తప్పిస్తాయి. అయితే టమాటా జ్యూస్ చేసుకునే సమయంలో ఇందులో ఉప్పు వేసుకోరాదని నిపుణులు సూచిస్తున్నారు.

3. దానిమ్మ జ్యూస్
దానిమ్మ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఉదర, పేగుల సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమే కాదు, అధిక రక్తపోటు నుంచి కూడా రక్షిస్తుంది. దానిమ్మ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో పేరుకుపోయిన పదార్థాలను తొలగిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ ను పెంపొదిస్తాయి. ఓవరాల్ గా రక్తపోటును నియంత్రించి గుండెపై భారాన్ని పడకుండా చూస్తాయి.

4. వెన్న తీసిన పాలు
వెన్న తీసిన పాలను ప్రతి రోజూ తాగడం ద్వారా అధిక రక్తపోటును కట్టడి చేయవచ్చు. ఎందుకంటే పాలలో అధికమోతాదులో కాల్షియం, పొటాషియం లభ్యమవుతాయి. ఇవి రక్తనాళాల్లో అడ్డంకులను తొలగించడంలోను, రక్తనాళాలను ఆరోగ్యకరంగా ఉంచడంలోను తోడ్పాటు అందిస్తాయి. హైబీపీతో బాధపడేవారికి వెన్న తీసిన పాలు మంచి ఔషధం అని నిపుణులు చెబుతున్నారు.

5. మందార పువ్వు టీ
మందార పువ్వు రేకులతో టీ చేసుకుని తాగడం వల్ల కూడా హైబీపీ తగ్గుతుంది. మందార పువ్వులో యాంథోసయానిన్స్ తదితర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడతాయి. తద్వారా రక్తప్రసరణ సజావుగా సాగేందుకు ఉపకరిస్తాయి. 

6. మెంతులు కలిపిన నీరు
మెంతులు కూడా అధికరక్తపోటు నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తాయట. వీటిని చాలామంది మధుమేహ రోగులు పరగడుపునే తీసుకోవడం చూస్తుంటాం. అయితే మెంతుల్లో ఉండే పీచు పదార్థం చెడు కొలెస్ట్రాల్ పై సమర్థంగా పనిచేస్తుంది. రక్తపోటు సాధారణ స్థాయిలో ఉండేలా తోడ్పడుతుంది. 

7. గ్రీన్ టీ
కాస్త ఖరీదైనదే అయినప్పటికీ ఇటీవల కాలంలో గ్రీన్ టీ వాడకం పెరిగింది. ఆరోగ్య విలువల పరంగా నిపుణులు దీనికి ఉన్నతస్థానం కల్పిస్తున్నారు. గ్రీన్ టీ తాగితే డయాస్టోలిక్ బీపీ తగ్గుముఖం పడుతుందని 13 అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రీన్ టీలో ఫ్లేవనాయిడ్స్, ఫ్లేవనోల్స్, టానిన్లు, కాటెచిన్స్ వంటి పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ యాంటీఆక్సిడెంట్ కేటగిరీలోకి వస్తాయి. ఇవి కండరాలను వదులు చేయడం, బిగుసుకుపోయిన రక్తనాళాలు మళ్లీ మృదువుగా మారేలా చూస్తాయి.

8. నీరు
అధిక రక్తపోటును నియంత్రిచడంలో తాగునీరు కూడా విశేష పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నీరు ఎందుకు శ్రేష్టమైన పానీయం అంటే.. ఇందులో చక్కెరలు ఉండవు, కెలోరీలు ఉండవు. పైగా శరీర జీవక్రియలకు ఇదే అత్యంతావశ్యకం. శరీరంలో తగినంత నీటి శాతం ఉంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. 

More Telugu News