Ramya Raghupathi: పవిత్రను నరేశ్ ఎలా పెళ్లి చేసుకుంటాడో చూస్తా: రమ్య రఘుపతి

Ramya Raghupathi comments on Naresh and Pavitra Lokesh relationship
  • నరేశ్, పవిత్ర లోకేశ్ మధ్య అనుబంధం
  • విడాకుల కేసు కోర్టులోనే ఉందన్న నరేశ్ భార్య రమ్య
  • విడాకులు ఇవ్వబోనని స్పష్టీకరణ
  • నరేశ్ తో కలిసి ఉండాలని కోరుకుంటున్నానని వెల్లడి

గత కొంతకాలంగా టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, క్యారెక్టర్ నటి పవిత్ర లోకేశ్ ల మధ్య రిలేషన్ షిప్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. త్వరలో పవిత్రను పెళ్లాడబోతున్నానంటూ నరేశ్ ఇటీవలే ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో, నరేశ్ భార్య రమ్య రఘుపతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రను నరేశ్ ఎలా పెళ్లి చేసుకుంటాడో చూస్తానని హెచ్చరించారు. తమకు ఇంకా విడాకులు మంజూరు కాలేదని, ఆ వ్యవహారం ఇంకా కోర్టులోనే ఉందని అన్నారు. నరేశ్ కు విడాకులు ఇచ్చేందుకు తాను సిద్ధంగా లేనని తేల్చి చెప్పారు. 

నరేశ్ ను తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, కానీ పెళ్లయ్యాక అతడి నిజస్వరూపం బట్టబయలైందని రమ్య రఘుపతి తెలిపారు. అనేకమందితో అతడికి సంబంధాలు ఉన్న విషయం తెలిసిందని, దీనిపై నిలదీస్తే క్షమాపణలు చెప్పాడని ఆమె వెల్లడించారు. నరేశ్ లో మంచి మార్పు కోసం ఎన్నో సంవత్సరాల తరబడి ఎదురుచూశానని, కానీ అతడిలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

'సమ్మోహనం' చిత్రం సమయంలో పవిత్రను ఇంటికి తీసుకువచ్చి తనకు పరిచయం చేశాడని, ఆమెను తాను ఎంతో బాగా చూసుకున్నానని రమ్య రఘుపతి వివరించారు. అయితే టాలీవుడ్ లో ఎన్నికలు జరిగిన సమయంలో వాళ్లిద్దరి ప్రవర్తనపై అనుమానం కలిగిందని, ఆ తర్వాత కాలంలో ఆ అనుమానమే నిజమైందని అన్నారు. సినిమా ప్రమోషన్ కోసం ఇలా చేశారేమో అని కూడా అనుకున్నానని, ఏదేమైనా నరేశ్ తో కలిసి ఉండడానికే పోరాటం చేస్తానని రమ్య స్పష్టం చేశారు. 

ఈ వ్యవహారం వల్ల తన పదేళ్ల కుమారుడు డిప్రెషన్ కు లోనవుతున్నాడని ఆవేదన వెలిబుచ్చారు. తామిద్దరం విడిపోవడం వాడికి ఇష్టం లేదని వెల్లడించారు.

  • Loading...

More Telugu News