Team India: భారత్ ను గెలిపించలేకపోయినా.. అరుదైన రికార్డు బ్రేక్ చేసిన అక్షర్ పటేల్

  • 31 బంతుల్లోనే 65 పరుగులు చేసిన అక్షర్
  • ఏడో నంబర్ లో వచ్చి ఎక్కువ రన్స్ చేసిన భారత క్రికెటర్ గా రికార్డు
  • ఈ స్థానంలో ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాడినూ ఘనత
Axar patel breaks few records in 2nd t20

శ్రీలంకతో నిన్న రాత్రి జరిగిన రెండో టీ20లో భారత్ పోరాడి ఓడిపోయింది. గెలుపు ఆశలే లేని స్థితిలో సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ అద్భుతంగా పోరాడటంతో టీమిండియా చివరి ఓవర్ వరకూ శ్రీలంకకు గట్టి పోటీ ఇచ్చింది. 207 పరుగుల లక్ష్య ఛేదనలో 57 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన దశలో సూర్యకుమార్, అక్షర్ ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. సూర్య 36 బంతుల్లో మూడు ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేసి ఆరో వికెట్ గా ఔటవగా ఆ తర్వాత అక్షర్ పటేల్ జూలు విదిల్చాడు. కేవలం 31 బంతుల్లోనే 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 65 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో శివం మావి కూడా 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేయడంతో భారత్ గెలిచేలా కనిపించింది. కానీ, ఆఖరి ఓవర్లో 21 పరుగులు కొట్టలేకపోయింది.

ఈ మ్యాచ్ లో జట్టు ఓడినా తన పోరాటంతో అందరి మనసులు గెలిచిన అక్షర్ పలు రికార్డులు కూడా బద్దలు కొట్టాడు. టీ20 మ్యాచ్  లో ఏడో నంబర్ లో వచ్చి భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా ఘనత సాధించాడు. 44 పరుగులతో ఉన్న రవీంద్ర జడేజాను వెనక్కు నెట్టాడు. అలాగే, ఏడు, ఆ తర్వాత నంబర్ లో బ్యాటింగ్ కు వచ్చి అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత క్రికెటర్ గా రికార్డు బద్దలు కొట్టాడు. ఇది వరకు 4 సిక్సర్లతో దినేశ్ కార్తీక్ పేరిట ఈ రికార్డు ఉంది. ఇక, ఈ మ్యాచ్ లో అక్షర్ 20 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. భారత్ తరఫున ఈ ఫార్మాట్ లో ఇది ఐదో వేగవంతమైన అర్ధ శతకం కావడం విశేషం.

More Telugu News