Bollywood: యోగీజీ.. మోదీజీకి చెప్పండి అంటూ బాయ్ కాట్ సెగ తప్పేందుకు యూపీ సీఎం సాయం కోరిన బాలీవుడ్

  • ఆదిత్యనాథ్ తో సమావేశం అయిన బాలీవుడ్ ప్రముఖులు
  • ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి తెలియజేయాలని వినతి
  • బాలీవుడ్ లో 99 శాతం మంది డ్రగ్స్ తీసుకోరని, కష్టపడి పని చేస్తారన్న సునీల్ శెట్టి
Suniel Shetty seeks UP CM Yogi Adityanaths help in removing Boycott Bollywood stigma

బాలీవుడ్ లో 99 శాతం మంది డ్రగ్స్ తీసుకోరని, ప్రజలకు చేరువ కావడానికి కష్టపడి పనిచేయడంపై దృష్టి సారిస్తారని సీనియర్ నటుడు సునీల్ శెట్టి అన్నారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న బాయ్ కాట్ బాలీవుడ్ అనే హ్యాష్ ట్యాగ్ ను తొలగించి బాలీవుడ్ పరిశ్రమను తిరిగి గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఆయన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సాయం కోరారు. 

ముంబైలో యూపీ సీఎం యోగి, బాలీవుడ్ ప్రముఖులతో నిర్వహించిన సమావేశంలో సునీల్ శెట్టి మాట్లాడారు. ‘ఈ హ్యాష్‌ట్యాగ్ తీసివేయాలి. బుట్టలో కుళ్ళిన ఆపిల్ ఉండవచ్చు. కానీ మనమందరం అలా కాదు. మన కథలు, మన సంగీతం ప్రపంచానికి కనెక్ట్ అవుతాయి. కాబట్టి కళంకం తొలగించాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ సందేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా తెలియజేయండి’ అని సీఎం యోగిని ఆయన కోరారు. 
 
ఈ మధ్య బాలీవుడ్ సినిమాలు సోషల్ మీడియాలో తరచూ బాయ్‌కాట్ సెగలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ లోని 'బేషరమ్ రంగ్' పాట రిలీజ్ సందర్భంగా మరో సారి బాయ్ కాట్ ట్రెండ్ అయ్యింది. ఈ పాటలో నటి దీపికా పదుకొణే కాషాయ రంగు బికినీలో డ్యాన్స్ చేయడంతో, ఇది హిందూ సమాజానికి అగౌరవం అంటూ పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాను బహిష్కరించాలని సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు.

 ఈ క్రమంలో ముంబైకి వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పలువురు బాలీవుడ్ ప్రముఖులతో ముచ్చటించారు. ఉత్తరప్రదేశ్‌ను భారతదేశంలో అత్యంత చలనచిత్ర అనుకూల రాష్ట్రంగా ప్రచారం చేయడానికి ఆయన రెండు రోజుల ముంబై పర్యటనకు వచ్చారు. బాలీవుడ్ ప్రముఖులతో సమావేశం అయ్యారు. సునీల్ శెట్టితో పాటు రవి కిషన్, జాకీ భగ్నాని, జాకీ ష్రాఫ్, రాజ్‌పాల్ యాదవ్, సోనూ నిగమ్‌ల, బోనీ కపూర్, సుభాష్ ఘయ్ సహా ఇతర ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

More Telugu News