Team India: నో బాల్స్ వేయడం నేరం: కెప్టెన్ పాండ్యా

  • జట్టు ఓటమికి పేసర్ అర్ష్ దీప్ ను నిందించలేమన్న హార్దిక్
  • రెండో టీ20లో ఐదు నో బాల్స్ వేసిన అర్ష్ దీప్
  • శ్రీలంక చేతిలో 16 పరుగుల తేడాతో ఓటమి
Not blaming Arshdeep Singh but bowling no ball is a crime says Hardik Pandya after India lose 2nd T20I

మూడు టీ20ల సిరీస్ లో భాగంగా పూణెలో గురువారం రాత్రి జరిగిన రెండో టీ20లో శ్రీలంక 16 పరుగుల తేడాతో ఆతిథ్య భారత్ ను ఓడించింది. దాంతో, సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక భారీ స్కోరు చేయడానికి భారత బౌలర్ల తప్పిదమే కారణం. బౌలర్లు ఏకంగా ఏడు నో బాల్స్ వేయడంతో పాటు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

ముఖ్యంగా యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్ దీప్ మ్యాచ్‌లో ఐదు నో బాల్స్ వేశాడు. అందులో కుశాల్ మెండిస్‌కి హ్యాట్రిక్ నో బాల్స్ కూడా ఉన్నాయి. శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్ తలో నో బాల్ వేయడంతో భారత్ మ్యాచ్‌లో మొత్తం 12 అదనపు పరుగులను ఇచ్చుకుంది. అయితే జట్టు ఓటమికి అర్ష్ దీప్ సింగ్ ని నిందించడానికి భారత టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిరాకరించాడు. నో బాల్ వేయడం నేరం అని పాండ్యా మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. పవర్‌ప్లే ఓవర్లలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ పేలవంగా ఆడిందని చెప్పాడు.

భారత జట్టు ప్రాథమిక తప్పిదాలు చేసిందని, అంతర్జాతీయ క్రికెట్ లో ఇలాంటి వాటికి ఆస్కారం ఉండకూదని అన్నాడు. ‘పవర్‌ ప్లే లో బౌలింగ్, బ్యాటింగ్ రెండూ మమ్మల్ని ముంచాయి. మేము ఈ స్థాయిలో చేయకూడని ప్రాథమిక పొరపాట్లను చేసాము. ఓ రోజు మనది కాకపోవచ్చు. కానీ, ప్రాథమిక విషయాలకు కట్టుబడి ఉండాలి. మూలాలను మర్చిపోకూడదు’ అని పాండ్యా చెప్పుకొచ్చాడు. 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో అరంగేట్రం ఆటగాడు రాహుల్ త్రిపాఠిని సూర్యకుమార్ యాదవ్ కంటే ముందే మూడో స్థానంలో పంపించడాన్ని పాండ్యా సమర్థించుకున్నాడు. జట్టులోకి కొత్తగా వచ్చిన త్రిపాఠికి సౌకర్యవంతమైన పాత్రను ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడు.

More Telugu News