Kandukur Stampede: కందుకూరు తొక్కిసలాట ఘటన.. తెల్లవారుజామున ఇంటూరి సోదరులకు బెయిల్

Inturi Brothers Got Bail In Kandukur Stampede Case
  • నిన్న సాయంత్రం హైదరాబాద్‌లో ఇంటూరి సోదరుల అరెస్ట్
  • అర్ధరాత్రి దాటాక 1.45 గంటలకు కందుకూరు పోలీస్ స్టేషన్‌‌కు చేరుకున్న వైనం
  • పోలీస్ స్టేషన్ బయట టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
  • పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వివాదం
  • తెల్లవారుజామున 5.20 గంటలకు బెయిలు మంజూరు చేసిన న్యాయమూర్తి
కందుకూరు తొక్కిసలాట ఘటనలో నిన్న సాయంత్రం హైదరాబాద్‌లో అరెస్ట్ అయిన ఇంటూరి సోదరులకు ఈ తెల్లవారుజామున 5.20 గంటలకు న్యాయమూర్తి పూర్ణిమాదేవి బెయిలు మంజూరు చేశారు. కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు, నెల్లూరు పార్లమెంటు టీడీపీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్‌లను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత 1.45 గంటలకు కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలేటి శ్రీధర్ నాయుడు, సీనియర్ న్యాయవాదులు బెజవాడ కృష్ణయ్య, కేవీ లక్ష్మీనారాయణ, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తదితరులు పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. వారి మధ్య వాగ్వివాదం జరిగింది.

ఈ క్రమంలో 2.30 గంటల సమయంలో హైకోర్టు న్యాయవాదులు కృష్ణారెడ్డి, పారా కిషోర్, నరేంద్రబాబు, పాండురంగారావుతో మరికొందరు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులతో చర్చలు జరిపారు. దీంతో వారిని స్టేషన్‌లోకి అనుమతించారు. ఆ తర్వాత 2.55 గంటలకు ఇంటూరు సోదరులను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అనంతరం స్థానిక న్యాయమూర్తి ఎదుట వారిని ప్రవేశపెట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి పూర్ణిమాదేవి ఇంటూరి సోదరులకు బెయిలు మంజూరు చేశారు. అప్పటి వరకు బయటే ఉన్న టీడీపీ శ్రేణులు బెయిలు విషయం తెలిసి హర్షం వ్యక్తం చేశాయి.
Kandukur Stampede
Nellore District
TDP
Inturi Brothers

More Telugu News